
10న వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2025–26 విద్యాసంవత్సరంలో భాగంగా ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, 17 బాల, బాలికలకు ఈనెల 10వ తేదీన వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డి.విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా పాఠశాలల్లో వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులను పంపించాలని కోరారు. ఈ సెలక్షన్ పోటీలు నల్లగొండ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం పైఅంతస్తులో నిర్వహిస్తామని, 2009 తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు తీసుకురావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9703269840 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్యకల్యాణతంతును పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు , లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
సాగర్‌కు తగ్గిన వరద
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌కు ఎగువనుంచి వరద తగ్గింది. దీంతో మంగళవారం తెరిచిన 22 క్రస్ట్‌గేట్లలో 18 గేట్లు మూసి వేశారు. ఆరుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 1,00,409 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా ఆరు రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి 48,414 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,333 క్యూసెక్కులు.. మొత్తం 81,747 క్యూసెక్కులు దిగువ కృష్ణానదిలోకి వదులుతున్నారు.

10న వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు