
అవినీతిని ప్రశ్నించేలా..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండడం, డిజిటల్ ఉపకరణాలను ఎక్కువగా వినియోగిస్తుండడంతో విద్యార్థులు, యువకుల్లో క్రమేణా ప్రశ్నించేతత్వం తగ్గుతోంది. వివిధ పథకాలు, కార్యక్రమాలు, పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిసినా వారు స్పందించడం లేదని వివిధ అధ్యయనాల్లో తేలింది. పట్టభద్రులైన యువకులు సైతం అవినీతి, అక్రమాల గురించి నిలదీయకపోతే సమాజానికి నష్టం జరుగుతుందని భావించిన ఉన్నత విద్యాముడలి సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను విద్యార్థులు, యువకుల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వారోత్సవాలు నిర్వహించింది.
తిరుమలగిరి (తుంగతుర్తి): విద్యార్థులు, యువకులు కళాశాలల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవడమే కాకుండా అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా సమాజంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించేలా సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 వారోత్సవాలు చేపట్టింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చేపట్టి సదస్సులు శనివారంతో ముగిశాయి. తద్వారా ప్రభుత్వాలు పారదర్శక పాలన అందించేలా ప్రతిఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవగాహన కల్పించారు.
మార్పు తేవాలనే లక్ష్యంతో..
ప్రస్తుత పోటీ, డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు, యువకుల్లో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాలన్న స్పృహ కరువైంది. ఎవరికి ఏమైతే మనకేంటి అనే ఆలోచనలో విద్యార్థులు, యువకులు ఉంటున్నా రు. ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లకే పరిమితమవుతూ సమాజంలో ఏ జరుగుతున్నా చూసి వదిలేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువకుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయించి వారోత్సవాలు చేపట్టింది.
పోరాడితేనే సమాజానికి మేలు
సమాచార హక్కు చట్టం సామాన్యుల ఆయుధం.. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ ఏమి జరిగినా సమాచారం తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ అస్త్రాన్ని సంధించి అవినీతి, అక్రమాలపై పోరాడితేనే సమాజానికి మేలు జరగనుంది. ఈ చట్టంపై నేటి విద్యార్థులు, యువకులకు అవగాహన కల్పిస్తూ ప్రశ్నంచేతత్వం అలవాటు చేస్తూ దాని ప్రత్యేకతను వివరించి వారిని మేల్కొలిపేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్సిటీలు, కళాశాలల్లో శనివారం వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఈ చట్టం విశిష్టత, ఉద్దేశాలు, ప్రయోజనాలు, దీనికింద ఆడగాల్సిన, అడగకూడని సమాచార వివరాలను వివరించారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసే విధానం, చెల్లించాల్సిన రుసుం, సమాచారం ఇవ్వకుంటే సంప్రదించాల్సిన విభాగాలు, అధికారుల గురించి కూడా తెలియజేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 15,612 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఫ సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు పాఠాలు
ఫ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
ఫ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అవగాహన సదస్సులు
ఫ శనివారంతో ముగిసిన ‘చట్టం’ వారోత్సవాలు
అవగాహన కల్పించాం
సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో పదునైన ఆయుధం. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఉన్నత విద్యామండలి ఆదేశాలతో చట్టం వారోత్సవాలు నిర్వహించి చట్టంపై అవగాహన కల్పించాం. ప్రభుత్వ పథకాలు, పనులు ఎంతవరకు వచ్చాయో ఈ చట్టం ద్వారా ప్రజలు సమాచారం తెలుసుకోవచ్చు. పారదర్శక పాలనతోనే అవినీతిరహిత సమాజం ఏర్పడుతుంది. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు, యువత అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాలి.
– బి.మృత్యుంజయ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తిరుమలగిరి

అవినీతిని ప్రశ్నించేలా..