
నేడు ప్రజావాణి
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసినందున సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా వాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీజేఐపై దాడి హేయమైన చర్య
సూర్యాపేట అర్బన్ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్.గవాయ్‌పై మతోన్మాద న్యాయవాది దాడికి పాల్పడడం హేయమైన చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మం పేరిట ప్రధాన న్యాయమూర్తిపై దాడికి పాల్పడి, బెదిరింపు ధోరణితో వ్యవహరిండచం మతోన్మాదానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీజేఐపై దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కుల, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ ఏకమై దోపిడీ వ్యవస్థపై పోరాడాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం గావించి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్య కల్యాణం జరిపి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి