
రేపు బుద్ధవనంలో ధమ్మవిజయం వేడుకలు
నాగార్జునసాగర్: ఈ నెల 14న ఉదయం 11 గంటలకు బుద్ధవనంలోని సమావేశ మందిరంలో ధమ్మవిజయం వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుద్ధుడి ధమ్మంపట్ల ఆకర్షితుడైన సామ్రాట్ అశోకుడు ఇకపై దిగ్విజయం స్థానంలో, దమ్మ విజయం చేకూరేలా చేస్తానని శాసనాల ద్వారా ప్రకటించిన సందర్భానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూణే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహేశ్ దియోకర్ దమ్మవిజయ విశిష్టతను వివరిస్తారని తెలిపారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, హైద్రాబాద్ రెడ్డి మహిళా కళాశాల ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, ఎంజేపీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత హాజరు కానున్నట్లు తెలిపారు. స్థానికులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.