
పసిడి పరుగులు
సూర్యాపేట అర్బన్ : బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు భద్రత, సంపదగా భావిస్తారు భారతీయులు. ధర ఎంత పెరిగినా పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు బంగారం లేకుండా జరిగే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు చాలా తక్కువకు కొనుగోలు చేసిన పసిడి ధర నేడు పేద, మధ్యతరగతి వర్గాలకు అందనంత పైకి ఎగబాకింది. ప్రస్తుతం సూర్యాపేట మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,24,710 కాగా 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.1,14,400 పలుకుతోంది. వెండి ధరలు కూడా అంతేవేగంగా పెరిగి కిలోకు రూ.1,78,000కు చేరుకుంది. గడిచిన ఆరు నెలలతో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2024 దసరా పండుగ సమయంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78వేలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.72 వేలు పలికింది. వెండి కిలో రూ.94 వేల వరకు ధర పలికింది. ఏడాదిలోపే 10 గ్రాముల బంగారం ధరకు దాదాపు రూ.47వేలు, కిలో వెండి రూ.84వేలకు వరకు పెరిగింది. దీంతో జనం వామ్మో.. ఇక బంగారం కొనలేం అనే పరిస్థితి దాపురించింది.
మూడు నెలల్లో భారీగా..
ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలు, క్రూడాయిల్ రేట్లు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్‌లో పేద,
మధ్యతరగతి వర్గాలకు కష్టమే
ప్రస్తుతం మంచి రోజులు ప్రారంభం అవ్వడంతో శుభముహూర్తాలు, వివాహాలు, గృహప్రవేశాలు, శారీ ఫంక్షన్లు, పండుగలు వరుసగా ఉండనున్నాయి. అయితే పెరిగిన బంగారం, వెండి ధరలతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు 200 గ్రాముల కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు కేవలం 5 నుంచి 6 గ్రాములతో సరిపెట్టుకుంటున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ల వేడుకల్లో పసిడి మెరుపులు లేకుండానే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను వాడుతున్నారు.
నగలు తక్కువ.. సేవింగ్స్ ఎక్కువ
బంగారం ధరలు కార్మికుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 10 గ్రాములు రూ.1.24 లక్షలు దాటడంతో ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య జిల్లాలో 70 శాతానికి తగ్గింది. ఉన్నత వర్గాల వారు బంగారం బిస్కెట్లు కొనుగోలు చేస్తూ ఫ్యూచర్ ఆస్తిగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆభరణం కంటే.. పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేసే ధోరణి పెరుగుతోంది. సంప్రదాయాలపై ఉన్న మమకారం ఒకవైపు కొనసాగిస్తూనే ఆర్థిక లాభాలను దృష్టిలో బంగారం కొంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్‌లో పసిడి ఒక స్టేటస్ సింబల్ కంటే పెట్టుబడి భద్రతా, భరోసా కల్పించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఫ రికార్డు స్థాయిలో పెరుగుతున్న
బంగారం ధరలు
ఫ రూ.1.24 లక్షలు దాటిన పది గ్రాముల ధర
ఫ కొనలేనిస్థితిలో పేద, మధ్యతరగతి వర్గాలు
ఫ పెళ్లిళ్లలో తగ్గుతున్న నగల ధగధగలు