
నిర్వహణ ఎత్తిపోయింది
నడిగూడెం : నాగార్జునసాగర్‌కు అనుబంధంగా నడిగూడెం మండల పరిధిలో నిర్మించిన ఎల్–34, ఎల్–35, ఎల్–36, ఎల్–10 ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మైనర్, మేజర్ కాల్వలు చెత్తాచెదారంతో నిండి పూడిపోవడం చివరి భూములకు నీరు అందడంలేదు. దీంతో పాటు ఈ పథకాలకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు నిత్యం మొరాయిస్తున్నాయి. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కాల్వలు పూడిపోయి..
నడిగూడెం మండల కేంద్రం సమీపాన సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఎల్–34 ఎత్తి పోతల పథకం ఉంది. ఈ పథకం కింద నడిగూడెం, రామాపురం గ్రామాలుండగా వీటి పరిధిలో 600 ఎకరాలు డిజైన్ చేశారు. ఈ ఎత్తి పోతల పథకం కింద కాల్వలు పూడి పోవడంతో పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎల్–35 పరిధిలో..
నారాయణపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఎల్–35 ఎత్తి పోతల పథకాన్ని నిర్మించారు. దీని పరిధిలో నారాయణపురం, బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం, కరివిరాల గ్రామాలున్నాయి. ఈ పథకం కింద దాదాపు 4,500 ఎకరాలు డిజైన్ చేశారు. ఈ లిఫ్ట్ కింద కాల్వలు అధ్వాన్నంగా ఉండంతో కరివిరాల, వేణుగోపాలపురం గ్రామాలకు నీరందడంలేదు.
కంపచెట్లతో నిండి..
కాగితరామచంద్రాపురం వద్ద ఎల్–36 ఎత్తి పోతల పథకం నిర్మించారు. దీని కింద కాగితరామచంద్రాపురం, కరివిరాల గ్రామాలున్నాయి. ఈ ఎత్తిపోతల కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కంపచెట్లతో పూడిపోయాయి. దీంతో ఈ ఎత్తిపోతల ద్వారా కేవలం కాగితరామచంద్రాపురం రైతులకు మాత్రమే నీరందుతోంది. చివరి ఆయకట్టు గ్రామమైన కరివిరాలకు సాగునీరు అందడంలేదు.
నిర్వహణలోపంతో..
సిరిపురం వద్ద ఆర్–10 ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో సిరిపురం, శ్రీరంగాపురం, త్రిపురవరం గ్రామాలున్నాయి. ఈ లిఫ్ట్ కింద 6,500 ఎకరాలు డిజైన్ చేశారు. కానీ నిర్వహణ లోపం వల్ల ఆయకట్టు గ్రామమైన త్రిపురవరం వరకు నీరు పోవడం లేదు. మేజర్, మైనర్ కాల్వలు పలు చోట్ల పూడి పోవడం, ఇంకా పలు చోట్ల కంపచెట్లు ఉండడంతో చివరి భూములకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు.
మొరాయిస్తున్న మోటార్లు
నడిగూడెం మండల పరిధిలోని నాలుగు ఎత్తి పోతల పథకాలకు చెందిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు నిత్యం మొరాయిస్తున్నాయి. దీంతో నిర్వహణ కష్టతరంగా మారింది. గతంలో ఎత్తి పోతల పథకాలను ఐడీసీ నిర్వహించేవారు. ప్రస్తుతం నీటి పారుదలశాఖ నిర్వహిస్తోంది. ఎత్తి పోతల పథకాల కింద సాగు చేసే రైతులు సరిగ్గా పన్నులు చెల్లించకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి చివరి భూములకు నీరందించేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఫ నడిగూడెం మండలంలో నాలుగు
ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తం
ఫ పూడిపోయిన మేజర్, మైనర్ కాల్వలు
ఫ చివరి భూములకు అందని సాగు నీరు
ఫ నిత్యం మొరాయిస్తున్న మోటార్లు
చివరి భూములకు నీరందించాలి
ఎల్–35 ఎత్తి పోతల పథకం కింద నాకున్న భూమిని సాగు చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా చివరి భూములకు నీరందడంలేదు. గత రబీ సీజన్‌లో ఎత్తి పోతల నుంచి నీరందక ఎకరం ఎండి పోయింది. సంబంధిత అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మత్తులు చేయించి, చివరి భూములకు నీరందించాలి.
–షేక్.మస్తాన్, రైతు, కరివిరాల
కాల్వలకు మరమ్మతులు చేయాలి
ఆర్–10 ఎత్తి పోతల పథకం పరిధిలో మేజర్, మైనర్ కాల్వలు కంపచెట్లతో నిండిపోయాయి. దీంతో చివరి భూములకు నీరందడంలేదు. అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు చేయించాలి.
–మన్నెం నాగిరెడ్డి, రైతు, త్రిపురవరం
ప్రతిపాదనలు పంపాం
ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే కాల్వలకు మరమ్మతులు చేపడతాం.చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తున్నాం.
– ఆనంద్ కుమార్, డీఈ, నడిగూడెం

నిర్వహణ ఎత్తిపోయింది

నిర్వహణ ఎత్తిపోయింది

నిర్వహణ ఎత్తిపోయింది