
ఇక.. ముఖం చాటేయలేరు!
సూర్యాపేట : కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది సమయానికి రాకపోవడం, వచ్చినా వెంటనే వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. దీంతో వైద్యులు అందుబాటులో లేక ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నివారించి, వైద్యసేవల్లో మరింత పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి వైద్య సిబ్బంది వివరాలను పంపించాలని ఆదేశించింది. అయితే ఫేస్ రికగ్నిషన్‌ను ప్రవేశపెట్టాలని ఆదేశిలిచ్చినా ఇందుకు సంబంధించి పరికరాలు ఇంకా రాలేదు.
జిల్లాలో 1500 మంది వైద్యసిబ్బంది
జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పీహెచ్‌సీలు 27, ఏరియా ఆస్పత్రులు 3, యూపీహెచ్‌సీలు 4, బస్తీ దవఖానాలు 5, పల్లె దవఖానాలు 122, ఆరోగ్య ఉప కేంద్రాలు 39 ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1500 మంది వరకు వైద్య సిబ్బంది ఆయా కేటగిరిల్లో పనిచేస్తున్నారు. వీటన్నింటిలోనూ ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది వివరాలను జిల్లా నుంచి ఉన్నతాధికారులకు నివేదించారు.
ఫేస్ రికగ్నిషన్‌తో మెరుగైన వైద్య సేవలు
మారుమూల ఆస్పత్రులకు వైద్య సిబ్బంది వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు వైద్య సిబ్బంది ఉదయం వచ్చి హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోవటం, లేదంటే రెండు రోజులకు ఒకసారి వచ్చి సంతకాలు చేయడం లాంటివి పరిపాటిగా మారినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్తున్నారు. కొన్నిచోట్ల బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఈ విధానంలో ఆశిం చిన స్థాయిలో ఫలితాలు రాకపోవటం, అవకతవకలకు అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతోంది.
ఉన్నతాధికారులకు వివరాలు పంపించాం
జిల్లాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. జిల్లాలో 1500 మంది వరకు వైద్యసిబ్బంది పనిచేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఫేస్ రికగ్నిషన్‌కు సంబంధించి పరికరాలు ఇంకా రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. పరికరాలు రాగానే అన్ని ఆస్పత్రుల్లో అమలు చేస్తాం.
– డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్‌ఓ
వైద్యసిబ్బందికి ముఖ హాజరు
ఫ 1వ తేదీ నుంచి
అమలయ్యే అవకాశం
ఫ వైద్య సేవల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని సర్కారు నిర్ణయం
ఫ ఉన్నతాధికారులకు చేరిన వైద్యులు, సిబ్బంది వివరాల నివేదిక