
నారు ఉచితం.. సాగుకు ఊతం!
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో నాణ్యమైన నారును రాయితీపై అందిస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయల నారు కావాల్సిన రైతులు నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఉద్యాన వన శాఖ అధికారులను సంప్రదించాలి.
– తీగల నాగయ్య, జిల్లా ఉద్యాన,
పట్టు పరిశ్రమ అధికారి
నాగారం : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వినియోగదారుల ఆర్థిక అంచనాలు తారుమారవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్’ (ఎంఐడీహెచ్) పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను హైబ్రిడ్ రకం మిర్చి, టమాట, వంకాయ పంటల సాగుకు నారు ఉచితంగా ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి 60 ఎకరాలకు సరిపడా నారును ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 813 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
మేడ్చల్ జిల్లా నుంచి నారు..
జిల్లాలో మిర్చి, టమాట, వంకాయ సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు ఉచితంగా నారు అందించనున్నారు. టమాట, వంకాయ పంటల సాగుకు ఎకరానికి 8 వేల మొక్కలు అవసరం కాగా మిర్చికి మరింత నారు పట్టనుంది. వీటిని సీవోయి మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నర్సరీలో పెంచుతున్నారు. ఇది వరకు ప్రభుత్వం రూ.6,500 రాయితీ ఇవ్వగా రైతు వాటా రూ.1,500 ఉండేది. ప్రస్తుతం రైతులకు నారును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుండగా, రైతులు రవాణా చార్జీలను భరించాల్సి ఉంటుంది.
నెల ముందే దరఖాస్తు..
కూరగాలయ పంటలను సాగు చేసే రైతులు నెల రోజుల ముందే అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తంగా ఈ సీజన్‌లో 60 ఎకరాలకు సరఫరా చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 30 ఎకరాలకు రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాగే 10 ఎకరాలకు అధికారులు ఇండెంట్ పంపించారు. ఈ ఏడాది మిర్చి, వంగ, టమాట నారులు ఇవ్వనుండగా.. వచ్చే ఏడాది మరికొన్ని కూరగాయల రకాల చెందిన నారును రైతులకు ఇవ్వనున్నట్టు తెలిసింది.
ఫ కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
ఫ మిర్చి, టమాట, వంకాయ సాగుపై దృష్టి
ఫ రెండు సీజన్లలో 60 ఎకరాలకు
నారు అందించాలని నిర్ణయం
ఫ ఉత్పత్తి పెంపునకే ‘ఎంఐడీహెచ్’ అమలు

నారు ఉచితం.. సాగుకు ఊతం!