
వైద్యరంగ సమస్యలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : వైద్యరంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రతి గ్రామంలో, గురుకుల, సంక్షేమ, కేజీవీబీ హాస్టల్‌లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పూల్లూరి సింహాద్రి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సక్క డిమాండ్ చేశారు. బుధవారం పీవైఎల్, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతున్నారన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. కార్యక్రమంలో పీవైఎల్, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ నాయకులు దరవత్ రవి, పోలెబోయిన కిరణ్ కుమార్, బండి రవి, రామ లింగమ్మ, పిడమర్తి భరత్, రాఖి, బోర లెనిన్, రవి, రమేష్, సతీష్, మహేష్, అనిల్ పాల్గొన్నారు.