
హైవే విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
అర్వపల్లి: రాష్ట్రంలో 15 జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎన్‌హెచ్–365 నకిరేకల్–మల్లంపల్లి సెక్షన్‌లోని, నకిరేకల్–తానంచర్ల రహదారి ఉంది. అలాగే ఎన్‌హెచ్ 365బీ సూర్యాపేట–జనగామ సెక్షన్‌లో 83 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ రెండు హైవేలు తుంగతుర్తి నియోజకవర్గం మీదుగా వెళ్తున్నాయి. అయితే ఈ హైవేలను రెండు వరుసలుగా విస్తరించి ఐదేళ్లు కావొస్తున్నా ఎలాంటి ట్రాఫిక్ పెరగకపోయినా మళ్లీ నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు వెళ్లడంతో ప్రజల్లో టెన్షన్ మొదలైంది. గతంలోనే ఇళ్లు, దుకాణాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు ఏమేమి కోల్పోవాల్సి వస్తుందేమోనని ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
గతంలోనే రెండు లేన్లుగా విస్తరణ
సూర్యాపేట–జనగామ హైవేను సూర్యాపేట నుంచి తిరుమలగిరి వరకు 40 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారిగా సుమారు రూ.140 కోట్ల వ్యయంతో 2019లో నిర్మించారు. అలాగే నకిరేకల్–తానంచర్ల రహదారిని 65 కిలోమీటర్ల మేర రూ.298 కోట్ల వ్యయంతో 2021లో విస్తరణ పనులు పూర్తిచేశారు.
రోడ్లను విస్తరించాక తగ్గిన ట్రాఫిక్
నకిరేకల్–తానంచర్ల రహదారిని నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి మూసీనది, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల మీదుగా మహబూబాబాద్ జిల్లా తానంచర్ల వరకు విస్తరించారు. ఈ రహదారి విస్తరణ జరిగాక హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేట–ఖమ్మం ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించారు. దీంతో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఈ రూట్లో వెళ్లడానికి దగ్గరదారి కావడంతో నకిరేకల్–తానంచర్ల రూట్లో వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. నకిరేకల్–తానంచర్ల రూట్ కాకుండా సూర్యాపేట–ఖమ్మం రూట్ అయితే సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో వాహనదారులు నకిరేకల్–తానంచర్ల రోడ్డుకు రాకుండా సూర్యాపేట–ఖమ్మం ఎన్‌ఎచ్‌ఏఐ రూట్లో వెళుతున్నారు. నకిరేకల్–తానంచర్ల రూట్లో వాహనాలు పదుల సంఖ్యలోనే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా కేవలం మూడే తిరుగుతున్నాయి. రెండు వరుసల రహదారిపైనే వాహనాలు లేనప్పుడు ఇంకా నాలుగు వరుసలుగా విస్తరించడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా నకిరేకల్–తానంచర్ల హైవేపై ఉన్న అర్వపల్లి వై జంక్షన్‌లో వాహనాలు నాలుగు రూట్లలో వేగంగా వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు హైవే అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఎన్‌హెచ్ 365, 365బీ నాలుగు వరుసల రోడ్డుకు కేంద్రం అనుమతి
ఫ ప్రస్తుత రోడ్డుపైన వాహనాల
రాకపోకలు తక్కువ ఉండడంతో ఫోర్‌వే ఎందుకని ప్రశ్నిస్తున్న ప్రజలు
20కి మించి వాహనాలు తిరగడం లేదు
అర్వపల్లి మీదుగా విస్తరించిన నకిరేకల్–తానంచర్ల 365 హైవేపై రోజు 20కి మించి వాహనాలు తిరగడం లేదు. అలాంటప్పుడు దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించడం ఎందుకో అర్థంకావడం లేదు. రహదారి విస్తరణ పక్కనబెట్టి అర్వపల్లిలోని వై జంక్షన్‌లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
– బైరబోయిన భూమయ్య, అర్వపల్లి

హైవే విస్తరణకు గ్రీన్‌సిగ్నల్