
ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం
హుజూర్‌నగర్ : రాష్ట్రంలో పేదవారి కడుపు నింపి వారికి ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్‌తో కలిసి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజల అభీష్టానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అర్హులైన వారికి తెల్ల రేషన్‌కార్డులు అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 7 లక్షల 95 వేల 685 కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసిందన్నారు. వాటి ద్వారా కొత్తగా 33 లక్షల 97 వేల 367 మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. రూ.396 కోట్లతో 10 వేల ఎకరాలకు నీరు అందించే రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ దొండపాడు–2 కి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 11 వేల రేషన్ కార్డులు నూతనంగా మంజూరు చేశామన్నారు. చింతలపాలెం మండలంలో కొత్తగా 1,116 కార్డులు, గరిడేపల్లి మండలంలో కొత్తవి 2446, హుజూర్‌నగర్ మండలంలో 2,300 కార్డులు, మఠంపల్లి మండలంలో 1400, మేళ్లచెరువు మండలంలో కొత్తగా 12 వేలు, నేరేడుచర్ల మండలంలో కొత్తగా 1700, పాలకీడు మండలంలో నూతనంగా 812 కార్డులు మంజూరు చేశామని తెలిపారు. వీటి ద్వారా నూతనంగా 52 వేల మందికి సన్న బియ్యం తినే హక్కు కల్పించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు..
ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఉండాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ అర్హులై ఉండి కార్డులు రాని రేషన్ కార్డులకు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, సివిల్ సప్‌లై ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్, ఎస్పీ కే.నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ శ్రీని వాసులు, డీఎస్‌ఓ మోహన్‌బాబు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి