
మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ఎస్పీ
సూర్యాపేటటౌన్ : మద్యం తాగి వాహనాలు నడపకూడదని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారం రోజులుగా 350 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. పట్టుబడిన వారిలో ఎనిమిది మందికి కోర్టు ఒకరోజు జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
హుజూర్‌నగర్ : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని బీసీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా చేపట్టిన ఇంకుడు గుంత నిర్మాణం, వర్మీ కంపోస్ట్ తయారు చేసేందుకు నిర్మించిన గుంతలను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలత, హెచ్‌ఎం జయప్రద, శానిటరీ ఇనన్‌స్పెక్టర్ అశోక్, ఏఈ. వినోద్ పాల్గొన్నారు.
ఆగస్టు 3న జిల్లా స్థాయి యోగా పోటీలు
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆగస్టు 3న ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి యోగా సెలక్షన్‌న్స్ నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తీకుల్ల సాయిరెడ్డి, ఉపాధ్యక్షురాలు వందనపు శ్రీదేవి, జనరల్ సెక్రటరీ గూడూరు నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచినవారు ఆగస్టు 7, 8 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 10 నుంచి 14 సంవత్సరాల వయసు వారు, జూనియర్ విభాగంలో 14 నుంచి 18 సంవత్సరాలు, సీనియర్ విభాగంలో 18 నుంచి 20 సంవత్సరాలు, సీనియర్ విభాగంలో ఏ సెక్షన్‌లో 28 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ విభాగం బీ సెక్షన్‌లో 35 నుంచి 45 సంవత్సరాలు, సీనియర్ విభాగం సీ సెక్షన్‌లో 45 నుంచి 55 సంవత్సరాల యోగా సాధకులు పాల్గొనవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9849844365, 9490137179 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు.
పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
హుజూర్‌నగర్ : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించి టీజీ జెన్‌కోలో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని మంగళవారం ప్రారంభించారు. మొత్తం 18 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్లు ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు టీజీ జెన్‌కో ఎస్‌ఈ దేశ్యానాయక్ తెలిపారు. సాగర్ క్రస్ట్‌గేట్లు మొత్తం 26 ఎత్తడంతో దాదాపు 2.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32 టీఎంసీలకు చేరుకుంది.