
పంచాయతీ కార్యాలయం ఎదుట చెత్త పోసి నిరసన
ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట) : పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు చెత్త వేసి నిరసన తెలిపారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని కోటపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, గ్రామంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయిందని మంగళవారం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. చెత్తను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం ఎదుట పోశారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. సిబ్బందిపై బాధ్యత వదిలేసి గ్రామ కార్యదర్శి విధులను పట్టించుకోవడం లేదన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను మెకానిక్ షెడ్‌లో పెట్టారని, రోజుల తరబడి చెత్తను తీయడం లేదని, మురికి కాలువలు నెలలకొద్దీ తీయకపోవడంతో దుర్వాసన వస్తోందన్నారు. మాజీ సర్పంచ్ మందడి శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వంగేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.