భూ వివాదం.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

భూ వివాదం.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

Jul 30 2025 7:08 AM | Updated on Jul 30 2025 7:10 AM

భువనగిరి: ఇరువర్గాల మధ్య ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందాడు. న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు మంగళవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో ధర్నాకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోటకూరి వెంకటయ్యకు ఇద్దరు కుమారులు తోటకూరి మల్లేష్‌, తోటకూరి భాను(32) ఉన్నారు. అదే గ్రామానికి చెందిన తోటకూరి బాలనర్సింహకు ఇద్దరు కుమారులు బాలయ్య, మల్లేష్‌లు ఉన్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం సమయంలో వెంకటయ్య, ఆయన చిన్నకుమారుడు భాను వ్యవసాయ బావి వద్ద ఉండగా పెద్ద కుమారుడు మల్లేష్‌ పొలంలో వరాలు తీస్తున్నాడు. భూ తగాదా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడే ఉన్న బాలనర్సింహ చిన్న కుమారుడైన మల్లేష్‌ వెంకటయ్య పెద్ద కొడుకును చూసి తిట్టడం ప్రారంభించాడు. ఇదే సయయంలో బాలనర్సింహ భార్య శంకరమ్మ, చిన్నకుమారుడు మల్లేష్‌, మల్లేష్‌ అన్న కొడుకై న అజయ్‌లు కలిసి వెంకటయ్య పెద్ద కుమారుడిని కొట్టారు. బాలనర్సింహ చిన్న కుమారుడు తన వద్ద ఉన్న గొడ్డలితో అక్కడే ఉన్న వెంకటయ్య చిన్న కుమారుడు భాను తలపై దాడి చేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటయ్య సైతం గాయపడ్డాడు. వారిని చికిత్స నిమిత్తం భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భానును హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడిన మల్లేష్‌, శంకరమ్మ, అజయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపారు.

భువనగిరి–జగదేవ్‌పూర్‌ రోడ్డుపై ధర్నా

న్యాయం చేయాలని భాను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భువనగిరి–జగదేవ్‌పూర్‌ రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరు పక్కల కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. పోలీసులు సర్దిచెప్పడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ రాహుల్‌రెడ్డి, రూరల్‌ సీఐ చంద్రబాబు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

గాయపడిన వ్యక్తి చికిత్స

పొందుతూ మృతి

న్యాయం చేయాలని బాధిత

కుటుంబసభ్యులు, బంధువుల ధర్నా

భూ వివాదం.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ 1
1/1

భూ వివాదం.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement