
దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించాలి
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీలు విద్యార్థులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉత్తమ సాధనంగా ఉండాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆయనతోపాటు, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న, శివారెడ్డి బృందం మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని సందర్శించి ప్రజా విచారణ చేపట్టారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఉత్తమ విద్య, విద్యార్థుల అభ్యున్నతికి యూనివర్సిటీల్లో నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశ భక్తిని పెంపొందించే గురుతర బాధ్యత యూనివర్సిటీలపై ఉందన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విద్యా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. అంతకు ముందు యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రిన్సిపాల్ శ్రీదేవి, అరుణప్రియ, సుధారాణి, ప్రొఫెసర్ అంజిరెడ్డి, ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ రేఖ, మద్దిలేటి, మిర్యాల రమేష్, దోమల రమేష్ పాల్గొన్నారు.
సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలి
యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. సర్వీస్ క్రమబద్ధీకరణతో పాటు ప్రస్తుత సర్వీస్‌ను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 250 మందికి పైగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు మూడంచెల వేతన విధానం ద్వారా తీవ్ర నష్టం జరుగుందని, ఏజెన్సీ విధానం రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ విద్యా కమిషన్
చైర్మన్ ఆకునూరి మురళి