
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ మృతి
చిలుకూరు: చిలుకూరు గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి దొడ్డా పద్మ (98) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు. బుధవారం చిలుకూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దొడ్డా పద్మ మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.
బైక్ అదుపుతప్పి
మహిళ మృతి
నకిరేకల్: బైక్ అదుపుతప్పి కింద పడడంతో మహిళకు తీవ్రగాయాలై మృతి చెందింది. ఈసంఘటన మంగళవారం నకిరేకల్ శివారులో చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన లోడే సత్యవతి(54), నకిరేకల్‌లో ఉంటున్న తన కుమారుడు ఉపేందర్ దగ్గరకు సోమవారం వచ్చింది. తిరిగి ఓగోడు గ్రామానికి వెళ్లేందుకు ఉపేందర్ తన మిత్రుడికి బైక్ ఇచ్చి ఇంటి వద్ద తన తల్లిని దింపి రమ్మని చెప్పాడు. ఈక్రమంలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈప్రమాదంలో సత్యవతి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణాచారి తెలిపారు.
హైవేపై కారు దగ్ధం
చిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు కిందికి దిగడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
గంజాయి స్వాధీనం
నడిగూడెం : ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నడిగూడెం ఎస్‌ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రత్నవరం గ్రామానికి చెందిన రాహుల్ అభిషేక్ అనే యువకుడు కోదాడ నుంచి రత్నవరం గ్రామానికి తన ద్విచక్ర వాహనంలో 200 గ్రాముల గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.