‘కల్యాణలక్ష్మి’ నిధులు కాజేశారు | - | Sakshi
Sakshi News home page

‘కల్యాణలక్ష్మి’ నిధులు కాజేశారు

Jul 29 2025 4:44 AM | Updated on Jul 29 2025 9:21 AM

‘కల్య

‘కల్యాణలక్ష్మి’ నిధులు కాజేశారు

కోదాడ: పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక చేయూతగా గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం హయాంలో కొందరు దళారులు బోగస్‌ పత్రాలు సృష్టించి కొందరి చేత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయించగా లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. వీరికి ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల చెక్కులు అందజేసింది. ఈ వ్యవహారంలో అనంతగిరి మండలం గొండ్రియాల, కొత్తగూడెంతోపాటు పక్కనే ఉన్న ఇంకొన్ని గ్రామాలకు చెందిన సుమారు 18 మంది బోగస్‌ లబ్ధిదారులున్నట్లు తెలిసింది. 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వారికి కూడా తాజా లబ్ధిదారుల జాబితాలో ఉండడం గమనార్హం. అనంతగిరి మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారి, కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద డాక్యుమెంట్‌ రైటర్‌గా ఉన్న మరొకరు, ఆయా గ్రామాలకు చెందిన నాటి బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి దాదాపు రూ.18 లక్షలకుపైగా కల్యాణలక్ష్మి పథకం నిధులు కాజేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయట పడడంతో తమపై కేసులు కాకుండా దళారులుగా వ్యహరించిన వారు రాజకీయ పైరవీలు చేస్తున్నట్టు సమాచారం.

ఏం చేశారంటే..

అనంతగిరి మండలంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి సాయంతో గోండ్రియాల, కొత్తగూడెం గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తప్పుడు వివాహ పత్రాలు సృష్టించి 2023లో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివాహాలు ఆయా గ్రామాల్లో జరిగినప్పటికి సమీపంలో ఏపీకి చెందిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఈ సమయంలో పనిచేసిన గ్రామ కార్యదర్శులు ఈ దరఖాస్తులను ధ్రువీకరించడానికి నిరాకరించడంతో కోదాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్‌ రైటర్‌గా పనిచేసిన ఒకరు తప్పుడు పత్రాలతో వివాహ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలిసింది. ఈ రెండు గ్రామాలకు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ఉండడంతో అక్రమార్కులు ఏపీలో కొన్ని గ్రామాలకు చెందిన వారితో కూడా కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయించి దొడ్డిదారిన లక్షల రూపాయలు కాజేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

తిలాపాపం తలా పిడికెడు

కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులో సగం మాత్రమే లబ్ధిదారుడి ఇచ్చి మిగిలిన డబ్బుల్లో రెవెన్యూ అధికారికి రూ.30 వేలు, ముఖ్య నాయకుడికి రూ.20 వేలు, మిగిలిన డబ్బులను ఖర్చుల కింద తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో మండలానికి చెందిన కొందరు నాయకులు చర్యలు తీసుకోకుండా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది.

రెండు రోజుల్లో విచారణ పూర్తిచేస్తాం

గోండ్రియాలలో కల్యాణలక్ష్మి చెక్కు విషయంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు రావడంతో పూర్తి స్థాయిలో విచారణ చెయిస్తున్నాం. అందరి వాగ్మూలం రికార్డు చేస్తున్నాం. రెండు రోజుల్లో విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కొత్తగూడెం గ్రామ విషయం మా దృష్టికి రాలేదు. నిర్ధిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.

– సీహెచ్‌.సూర్యనారాయణ, ఆర్డీఓ, కోదాడ

వివాహ సంవత్సరాన్ని మార్చి

బోగస్‌ పత్రాలు సృష్టించి..

గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తులు

చెక్కులు మంజూరు చేసిన

ప్రస్తుత ప్రభుత్వం

రూ.18లక్షలకుపైగా నొక్కేసినట్టు

సమాచారం

అనంతగిరి మండలంలో సుమారు

18 మంది వరకు బోగస్‌ లబ్ధిదారులు!

అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన ఓ యువతికి 2009లో వివాహం జరిగింది. ఈమె వివాహం 2023లో జరిగినట్లు గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయగా లబ్ధిదారురాలిగా ఎంపికచేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గతేడాది కోదాడలో జరిగిన కార్యక్రమంలో ఈమెకు చెక్కు అందజేశారు. కానీ, రెండు నెలల క్రితం ఈమె తన ఇద్దరి కుమార్తెలకు చీరల ఫంక్షన్‌ చేయడం గమనించదగ్గ విషయం. మొత్తంగా బోగస్‌ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి పథకం నిధులు కాజేసినట్టు బయట పడింది. ఇలా ఈ గ్రామంతోపాటు కొత్తగూడెం గ్రామంలోనూ సుమారు 18 మంది వరకు బోగస్‌ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి నిధులు కాజేసిన వ్యవహారం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘కల్యాణలక్ష్మి’ నిధులు కాజేశారు1
1/1

‘కల్యాణలక్ష్మి’ నిధులు కాజేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement