
రైతులకు రాయితీ పరికరాలు
నాగారం : జాతీయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం జిల్లాకు 125 యూనిట్లు మంజూరు చేసింది. ఇందుకు గాను రూ.1.84 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద ప్రభుత్వం ఈ నిధులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఇందుకోసం అర్హులైన రైతులను త్వరలో ఎంపిక చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే ఆగస్టు నుంచి దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
మహిళలకు 50 శాతం..
రైతులకు అందించే వ్యవసాయ పరికరాలపై ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా రైతులకు 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. మిగతా వారికి 40 శాతం రాయితీపై అందిస్తారు. ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి వాటాను డీడీల రూపంలో తీసుకోనున్నారు.
కమిటీల ద్వారా ఎంపిక
రైతులకు రాయితీ పరికరాలు ఇచ్చేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఏఓ, ఆగ్రోస్ ఆర్‌ఎం, ఎల్‌ఎడీఎం, డాట్ సెంటర్ శాస్త్రవేత్త సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలు ఉంటారు. అర్హులైన రైతులను ఈ కమిటీలు ఎంపిక చేస్తాయి.
అర్హతలు ఇవే..
రాయితీ పరికరాలను పొందేందుకు సదరు రైతులకు కనీసం ఎకరం భూమి ఉండాలి. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. వచ్చిన యూనిట్లను మండలాల వారీగా కేటాయిస్తారు. ఈ నిధులు ఖర్చు చేసిన తర్వాత రెండో విడతలో యూనిట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
సబ్సిడీ పరికరాలు ఇవే..
మ్యానువల్ స్ప్రేయర్లు, పవర్ ఆపరేటర్ స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో నడిచే వ్యవసాయ పరికరాలు, రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రులు, కలుపు తీసే యంత్రాలు, కేజీవీల్స్ వంటివి 125 యూనిట్లు మంజూరయ్యాయి.
యాంత్రీకరణ పథకం కింద
125 యూనిట్లు కేటాయింపు
జిల్లాకు రూ.1.84 కోట్లు మంజూరు
ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ రెండో వారం వరకు పంపిణీ
దరఖాస్తులు స్వీకరిస్తాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలను అందజేస్తాం. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తాం. – జి.శ్రీధర్‌రెడ్డి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

రైతులకు రాయితీ పరికరాలు