
మహిళపై దాడి.. ముగ్గురి అరెస్ట్
నూతనకల్: భూ తగాదాలు, పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని మహిళపై కత్తితో దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన లింగాల నానయ్య, లింగాల లింగమూర్తి మధ్య కొంతకాలంగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన లింగాల లింగమూర్తి భార్య రేణుకపై పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని లింగాల నానయ్య, అతడి భార్య లలిత, కుమారుడు ఏకస్వామి కత్తితో దాడి చేసి గాయపర్చారు. రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ గావించారు. స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు పాల్గొన్నారు.