
మూసీ ప్రాజెక్టుకు జలకళ
వరద నీటితో కళకళలాడుతున్న మూసీ రిజర్వాయర్
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. మూసీ ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం సాయంత్రం మూసీ ప్రాజెక్టుకు 880 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 2443 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెక్టుకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లో రావటం ఈ ఏడాది ఇదే మొదటిసారి. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 530 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 642.50 అడుగులకు (3.73 టీఎంసీలు) చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో మరో రెండు అడుగుల నీరు చేరితే గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని పేర్కొంటున్నారు.