
మోదీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
కోదాడరూరల్ : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తన స్వగ్రామం కోదాడ మండలం నల్లబండగూడెం అని అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత గడ్డపై ఉన్న మమకారంతోనే తొలిపర్యటన సూర్యాపేట జిల్లాలనే చేపట్టానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో 13 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇతర దేశాల సహాయం కోసం ఎదురు చూసిన దుస్థితి నుంచి నేడు 54 దేశాలకు ఆర్థిక సాయం చేసే స్థాయికి భారత్‌ను తీసుకొచ్చిన ఘనత బీజేపీకి దక్కుందని పేర్కొన్నారు. 2047వరకు ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత దేశం అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అనంతరం రాంచందర్‌రావును వివిధ సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, బొబ్బా భాగ్యారెడ్డి, డాక్టర్ సుబ్బారావు, కనగాల నారాయణ, కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, బండారు కవితారెడ్డి, మల్లెబోయిన అంజియాదవ్, అక్కిరాజు యశ్వంత్, బొలిశెట్టి కృష్ణయ్య, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు