
బీఆర్‌ఎస్ హయాంలోనే సమృద్ధిగా గోదావరి జలాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): పది సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తుంగతుర్తి నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చాయని, గోదావరి జలాలు పుష్కలంగా వచ్చి సమృద్ధిగా పంటలు పండాయని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు యుగేంధర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రజాక్ గుర్తు చేశారు. మంగళవారం తిరుమలగిరిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభను కాంగ్రెస్ సభగా మార్చారని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు సమృద్ధిగా రావడంతో చెరువులు నిండి జాలుపట్టి పోయాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్లు లేక చెరువులు ఎండి పోతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ల సహకారంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీరు ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వ్యక్తిగతంగా దూషణలు చేయడం, స్థాయికి తగ్గట్లుగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని, పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలందరికీ నెలకు రూ.2500 ఇవ్వాలని కోరారు. రుణమాఫీ, రైతు భరోసా సరిగా అమలు కావడం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, తాటికొండ సీతయ్య, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి శోభన్‌బాబు, కందుకూరి బాబు పాల్గొన్నారు.