
అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు
నాగారం : అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు క్షేత్రస్థాయిలో మరింత మెరుగుపడాలంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో ఐసీడీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందిం. దీంతో జిల్లాలో ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 78 టీచర్, 274 ఆయా(సహాయకుల) పోస్టులు త్వరలోనే భర్తీకానున్నట్టు తెలుస్తోంది.
వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని..
అంగన్‌వాడీలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతా మని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, ఆయా పోస్టుల వివరాలు సేకరించి నివేదిక తయారు చేశారు. గత కొన్నేళ్లుగా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉండడంతో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని కేంద్రాల టీచర్లకు అప్పగించారు. మరికొన్ని కేంద్రాలను ఆయాలతోనే నెట్టుకొస్తున్నారు. దీని కారణంగా అంగన్‌వాడీ సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్ని అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖాళీల వివరాలు సేకరించారు.
మార్కుల ఆధారంగానా.. పరీక్ష నిర్వహిస్తారా!
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 78 టీచర్, 274 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో అంతకు ముందే పోస్టులను భర్తీచేయడం సరికాదని ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వర్గీకరణ అంశం కొలిక్కి రాగానే నెలరోజుల్లో పోస్టులను భర్తీ చేయవచ్చని భావించింది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలు సేకరించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. గతంలో ఇంటర్ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడూ అలాగే చేస్తారా లేక రాత పరీక్ష నిర్వహిస్తారా అన్నదానిపై విధివిధానాలు విడుదల కావాల్సి ఉంది.
ఉన్నతాధికారులకు ఖాళీల వివరాలు అందజేశాం
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం.
– నర్సింహారావు,
జిల్లా సంక్షేమ అధికారి
ఫ 78 టీచర్, 274 ఆయా పోస్టులు ఖాళీ
ఫ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని
ప్రకటించిన ప్రభుత్వం
ఫ విధివిధానాలపై స్పష్టత కరువు
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05
అంగన్‌వాడీకేంద్రాలు 1,209
చిన్నారులు 45,177
గర్భిణులు 5,220
బాలింతలు 4,236

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు