కొబ్బరికాయలు కొట్టేశారు! | - | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయలు కొట్టేశారు!

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

కోడ్‌కు ముందే..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పటివరకు గుర్తుకు రాని అభివృద్ధి పనులు ఎన్నికల వేళ శిలాఫలకాలుగా మారిపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే పునాదిరాళ్లు వేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. ఈ హడావుడి వెనుక ప్రజా ప్రయోజనం కంటే స్థానిక ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే వ్యూహమే స్పష్టంగా కనిపించింది.

టెండర్లు పిలవకుండానే..

సాధారణంగా ఏదైనా పని జరగాలంటే దానికి పరిపాలన అనుమతులు రావాలి. నిధులు మంజూరు కావాలి. ఆపై టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. కానీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు శంకుస్థాపన జాతరలో ఈ ప్రాథమిక సూత్రాలన్నీ గాల్లో కలిసిపోయాయి. టెండర్లు కూడా ఖరారు కాని పనులకు, కొన్నిచోట్ల ప్రతిపాదనల దశలో ఉన్న వాటికి సైతం కొబ్బరికాయలు కొట్టేశారు. పనులు ఎప్పు డు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు గానీ తమ పేరుతో శిలాఫలకం పడిపోవాలనే ఆరాటం మాత్రం ఇక్కడ కనిపించింది.

కోడ్‌ కూస్తుందేమోనన్న ఆత్రుతతో..

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే ఎలాంటి కొత్త పథకాలు, శంకుస్థాపనలు చేయడానికి వీలుండదు. అందుకే కోడ్‌ రాకముందే ‘మేము ఈ పనులు మంజూరు చేసేశాం’ అని ఓటర్ల ముందుకు వెళ్లడానికి ఈ హడావుడి కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కూటమి ఎమ్మెల్యేలు ప్రతి రోజూ జిల్లాలోని ఏదో ఒక మూల కొబ్బరికాయలు కొడుతూ బిజీగా కన్పించారు. గ్రామాలు, వార్డుల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలను ఒక్కరోజులోనే పరిష్కరించేసినట్లు కలర్‌ ఫుల్‌ ఫ్లెక్సీలు పూజా కార్యక్రమాలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు అభివృద్ధి భ్రమలు కల్పించారు. కొన్నిచోట్ల కనీసం కాంట్రాక్టర్‌ ఎవరో తెలియకుండానే, పనులు ఎవరు చేస్తారనే స్పష్టత లేకుండానే శంకుస్థాపనలు జరగడం గమనార్హం.

షెడ్యూల్‌ విడుదలకు ముందు ఇలా..

టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ పరిధిలో ఈ నెల 11న రోడ్లు, డ్రైన్లు, హెల్త్‌ క్లినిక్‌, బస్సు షెల్టర్‌ తదితర రూ.7.89 కోట్ల పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. టెక్కలి– తెంబూరు రహదారిలో రూ.2.6 కోట్లతో రహదారి విస్తరణ పనులకు, సీతారాంపురంలో రూ.4 లక్షలతో బస్‌ షెల్టర్‌, రూ.14.30 లక్షలకు హెల్ల్‌ క్లినిక్‌, మెట్టపేటలో రూ.43 లక్షలతో రోడ్డు, సతివాడలో రూ.90 లక్షలతో రెండు బీటీ రోడ్లు, సవర సొర్లిగాంలో రూ.47.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జోరుగా జరిగాయి.

గత శంకుస్థాపనలకు కలగని మోక్షం

అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన శంకుస్థాపనల పునాది రాళ్లు ఇప్పటికీ ముళ్లపొదల్లో దర్శనమిస్తున్నాయి. శిలాఫలకాలు వేసిన తర్వాత సదరు కాంట్రాక్టర్లు బిల్లులు రాకనో, అసలు నిధులే విడుదల కాకనో పనులు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రభుత్వ గ్రాంట్‌ ఒక్క రూపాయి కూడా రాలేదు. కొత్తగా ఒక్కరికీ పింఛను ఇవ్వలేదు. పల్లె పండగ పేరుతో చేపట్టిన పనులు ముందుకు సాగలేదు. జిల్లాలో రూ.వంద కోట్లకు అంచనా వ్యయంతో 281 రోడ్లు వేసేందుకు శంకుస్థాపనలు చేస్తే ఇప్పటివరకు రూ.20 కోట్ల విలువ రోడ్లు కూడా పడలేదు. పంట నష్ట పరిహారాలు అందించలేదు. తుఫాన్లకు ధ్వంసమైన రోడ్లు, చెరువులు, కాలువల పనులు చేపట్టలేదు.

చంద్రబాబు హామీలకే దిక్కులేదు..

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకొచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. దీపం–2 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం ప్రారంభోత్సవానికి 2024 నవంబర్‌ 1న ఇచ్ఛాపురం మండలానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలదీ అదే దారి. 2025 ఏప్రిల్‌ 26న మత్స్యకార భరోసా ప్రారంభించేందుకు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వచ్చినప్పుడు ఇచ్చిన హామీలకు అతీగతి లేదు. ఈ ఏడాది మే 9న మీ భూమి– మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు జలుమూరు మంలం అక్కురాడ గ్రామానికి వచ్చినప్పుడు, చివరిగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పర్యటనలో భాగంగా ఈ ఏడాది మే 16న నరసన్నపేట మండలం తామరాపల్లిలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలు అడుగు కూడా కదల్లేదు.

ఓటర్లను మభ్యపెట్టేందుకు శంకుస్థాపనల జాతర

టెండర్ల ముచ్చట లేదు..నిధుల ఊసే లేదు..

కూటమి నేతల తీరుపై విస్తుపోతున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement