డబ్బులు కడితేనే..
ఫిట్నెస్ కేంద్రాల్లో..
● వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు ● బండికో రేటు చొప్పున అదనంగా చెల్లించాల్సిందే ● దృష్టి సారించని రవాణాశాఖ అధికారులు
శ్రీకాకుళం రూరల్ : శ్రీకాకుళం పరిధిలో కిమ్స్ ఆసుపత్రి, వ్యవసాయ కార్యాలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీ కేంద్రం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్(ఫిట్నెస్ సెంటర్)లో దోపిడి దందా సాగుతోంది. ఏదైనా కొత్త వాహనం రెండేళ్లు పరిమితి దాటితే దాన్ని రెన్యువల్ చేసేందుకు అన్నీ ఫిట్గా ఉన్నప్పటికీ ఏదో ఒక వంకతో ఫిట్నెస్ కేంద్రం యాజమాన్యం డబ్బులు లాగేస్తోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
చలానా కట్టినా..
ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వానికి చలానా కడితే నేరుగా వాహనాన్ని తీసుకెళ్లి ఫిట్నెస్ చేయించుకోవాలి. దీనికి గాను వాహన యజమాని లేజర్ కోడ్ ఎంట్రీ చేయగానే ఓటీపీ వెళ్తుంది. డేట్, టైమ్తో వాహనాన్ని నేరుగా కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. అక్కడకు వెళ్లగానే ముందుగా రిఫ్లెక్టర్స్ రిబ్బన్ల పేరిట లారీ, బస్సు, కారు ఇలా వాహనం ఏదైనా అదనంగా రూ.800 కట్టాలి. వారు ఇచ్చే నాశిరకం రిబ్బన్లు వాహనానికి ఏర్పాటు చేయాలి. రిబ్బర్లు పేరిట వసూలు చేసిన సొమ్ములో కొంత భాగం ఫిట్నెస్ కేంద్రం యాజమాన్యానికి వెళ్తుంది. ఈ రిబ్బన్ కూడా రెండు మూడు నెలలకే కలర్ మారిపోతుంది.
రిటైర్డ్ ఉద్యోగి కనుసన్నల్లోనే దందా..
ఫిట్నెస్ కేంద్రంలోని దందా అంతా గతంలో రవాణా శాఖలోనే ఎంవీఐగా పనిచేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి కనుసన్నల్లో జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో రవాణాశాఖ కార్యాలయానికి సంబంధం లేకుండానే వాహనాలకు సంబంధించి అధిక రుసుం వసూలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అదనపు వసూళ్లు ఇలా..
ఏదైనా వాహనానికి సంబంధించి ప్రభుత్వానికి కట్టిన చలానా తక్కువ అయినప్పటికీ ఫిట్నెస్ కేంద్రంలో మాత్రం అదనపు వసూళ్లు వాహనదారులకు నడ్డి విరుస్తున్నాయి. ట్రాన్స్పోర్టు వాహనాలకు అదనంగా రూ.1000, 10 టైర్లకు, 12 టైర్లకు రూ.3,500, 16, 14 టైర్లకు, బస్సులకు రూ.5,500, ఆటోలకు రూ.1500, బస్సులు, కారు, ఎల్పీజీ వాహనాలకు రూ.2000 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫిట్నెస్ కేంద్రంలో వాహనదారుల నుంచి అక్రమంగా అదనపు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఫిట్నెస్ కేంద్రంపై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యతు తప్పవు. త్వరలోనే ఆ సెంటర్ను విజిట్ చేస్తా.
– విజయసారధి,
శ్రీకాకుళం డీటీసీ
ప్రతి వాహనం నుంచి ఫిట్నెస్ కేంద్రంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వాహనానికో రేటు చొప్పున ముందుగా డబ్బులు కడితేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఇక్కడ నిబంధనలు పాటించడం లేదు. గతంలో రవాణాశాఖ అధికారులు బండిని పర్యవేక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఇక్కడ మాత్రం సాంకేతిక అర్హత లేని వారితో తనిఖీలు చేస్తూ వాహన యజమానులపై దందా చేస్తున్నారు.
– బి.శేషగిరి,
నమతా మోటార్ ట్రక్కర్ అసోసియేషన్ కార్యదర్శి


