● నోటీసులు ఇచ్చినా మేము ఇళ్లు ఖాళీ చేయం
● ఈ ఇళ్ల కోసం టీడీపీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడు
● కుందువానిపేటలో హుద్‌హుద్ ఇళ్ల లబ్ధిదారులు
మేమే ఆహ్వానించాం
మా గ్రామంలో హుద్‌హుద్ ఇళ్ల నిమిత్తం అర్హత కలిగిన ఆరుగురు మాత్రమే ఉండిపోయారు. వారి గృహప్రవేశం నిమిత్తం మేమంతా వెళ్లి గృహప్రవే శానికి రావాలంటూ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును ఆహ్వానించాం. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు అందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు. ఈ ఇంటిలోనే ఉంటున్నాం. – సూరాడ సూర్యం,
మాజీ సర్పంచ్, కుందువానిపేట
టీడీపీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడు
మా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూరా డ అప్పన్న ఇంటి కోసం రూ.12వేలు తీసుకున్నాడు. మేము వైఎస్సార్ సీపీ కావడంతో మా పట్టాను ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. మా లాంటి పేద మత్స్యకారులను ఇల్లు ఖాళీ చేయించమనడం చాలా దారుణం.
– బర్రి సీతమ్మ, కుందువానిపేట
గ్రీవెన్స్‌లో దరఖాస్తు పెట్టాం
అర్హులైన మాకు పట్టాలు ఇవ్వాలంటూ దఫదఫాలుగా గ్రీవెన్స్‌లోనూ, హౌసింగ్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాం. కానీ ఇంతవరకూ పట్టాలు ఇవ్వలేదు. మా ఇళ్లలో మేము స్వచ్ఛందంగానే గృహప్రవేశాలు చేశాం తప్ప ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. ఇప్పుడు మాకు కరెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. మాకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆ ఇల్లే దిక్కు.
– రాయి కనకమ్మ, కుందువానిపేట
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కుందువానిపేట గ్రామంలో ఏర్పాటు చేసి న హుద్‌హుద్ ఇళ్లు అర్హత ప్రకారమే వచ్చాయని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని లబ్ధిదారులు తేల్చి చెప్పారు. ఈ ఇళ్ల కోసం స్థానిక టీడీపీ నాయకుడు రూ.12వేలు చొప్పున 145 మంది వద్ద డబ్బు దండేశాడని బట్టబయలు చేశారు. కాలక్రమంలో ఇందులో 21 మంది మిగిలిపోయారని, అందులో 15 మందికి స్థానిక టీడీపీ నాయ కులు ఇళ్లను కట్టబెట్టారని, ఆరుగురు వైఎ స్సార్ సీపీ సానుభూతిపరులనే కారణంతో ఇల్లు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం తమ అర్హత మేరకు ఆ ఇళ్లను తమకు కేటాయించిందని, దీని కోసం టీడీపీ నాయకుడు డబ్బులు కూడా తీసుకున్నాడని లబ్ధిదారులైన బర్రి సీతమ్మ, రాయి కనకమ్మ, బుర్రి ఈశ్వరమ్మ, బర్రి లక్ష్మమ్మతో పాటు మరో ఇద్దరు గృహ ప్రవేశాలు చేశారు. ఈ గృహ ప్రవేశాలకు రావాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పట్లో ఆహ్వానం ఇచ్చారు.
ఈ ఆరుగురికి మాత్రమే నోటీసులు
హుద్‌హుద్ ఇళ్లు మంజూరు చేసిన వారిలో ఈ ఆరుగురికి మాత్రమే హౌసింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయించాలని చూడడం చర్చనీయాంశమైంది. ఉన్న ఫళంగా ఇళ్లను ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడం, మూడు రోజులే గడువు ఇవ్వడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన హుద్‌హుద్ ఇళ్లలో గృహ ప్రవేశం చేయడం తప్పు కాదని హౌసింగ్, రెవెన్యూ అధికారులకు సైతం ఉత్తర్వులు వచ్చాయి.
ఇది కోర్టు ధిక్కరణే
హుద్‌హుద్ ఇళ్లను పేదలైన మత్స్యకారులకు అర్హత మేరకు ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక టీడీపీ నాయకుడు కక్ష పూరితంగా ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటూ వేరొకరికి కట్టబెట్టాలని పూనుకున్నాడు. ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశాం. ఇటీవల వచ్చిన ఉత్తర్వులు ప్రకారం అర్హత ఉన్న వారికి, ప్రభుత్వం మంజూరు చేసిన లిస్టులో ఉన్న వారికి ఇల్లు ఇవ్వడం తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతా లీగల్‌గానే ఇళ్లల్లో గృహప్రవేశాలు జరిగాయి. హౌసింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారు లు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. – అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు


