● గురువుల ఆత్మగౌరవంపై సర్కారు ఒత్తిళ్ల రాజకీయం
● ఇది సరికాదంటోన్న మేధావులు, విద్యావేత్తలు
కాశీబుగ్గ : గరుడఖండి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఐదుగురు టీచర్లు గాయపడ్డారు. వీళ్లేమీ విహార యాత్రకు బయల్దేరలేదు. ప్రభుత్వం బలవంతపెట్టడంతో ఆత్మగౌరవ ర్యాలీకి బయల్దేరి ఇలా క్షతగాత్రులయ్యారు. వీరు భౌతికంగా గాయపడ్డారు. సర్కారు తీరు వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్న టీచర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. డీఎస్సీ 2025లో వైఫల్యాలు, తప్పిదాలు జరిగాయంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అధికార పక్షం వాటికి ఆధారాలు చూపించి అక్రమాలు జరగలేదని నిరూపిస్తే సరిపోతుంది. కానీ టీచర్లను ఉసిగొల్పి వారితో ర్యాలీలు చేయించి రాజకీయాలకు పూనుకోవడం విద్యా వేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
గురువుల ఆత్మగౌరవంపై ఒత్తిళ్ల రాజకీయం
ఉపాధ్యాయులు విద్యా బోధన మరిచి ప్రభుత్వ బలనిరూపణకు బలవుతున్నారు. డీఎస్సీ–2005 నియామక ప్రక్రియలో జరిగిన వైఫల్యాలు, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ చివరికి గురువులను కూడా తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది. బోధనేతర విధులతో ఇప్పటికే సతమతమవుతున్న టీచర్లను ఇప్పుడు బలవంతంగా రోడ్లపైకి లాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
ఒత్తిళ్ల వలయంలో ఉపాధ్యాయులు
ప్రస్తుతం విద్యా బోధన కంటే ప్రభుత్వ యాప్‌ల నిర్వహణలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. డిజిటల్ అటెండెన్స్, మధ్యాహ్న భోజన నిర్వహణ వివరాల అప్ లోడ్ అంశాలతో అనుని త్యం ఒత్తిళ్ల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తమకు మద్దతుగా ఆత్మ గౌర వ ర్యాలీలు చేయాలంటూ సర్కారు హుకుం జారీ చేస్తోంది. ఫలితంగా ఊరుకాని ఊరికి వెళ్లి ర్యాలీలకు హాజరు కావాల్సి వస్తోంది.
విద్యావేత్తలు, మేధావుల ఆందోళన
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలనే ఆరాటంలో ఉపాధ్యాయులు భౌతిక, మానసికంగా తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సమయానికి హాజరవ్వాలనే కంగారు, అధికారుల వేధింపుల భయంతో వారు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇందుకు గరుడఖండిలో జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. ఉపాధ్యాయులను ర్యాలీలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం గురువుల ప్రాణాలను ఫణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.


