ప్రశ్నించే గొంతులను కేసులతో అణచలేరు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతులను కేసులతో అణచలేరు

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని ఖండిస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌.నాగభూషణం, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రవికుమార్‌ మాట్లాడుతూ ప్రశ్న రావణ్‌ను జైలుకు పంపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమని, ఈ చట్టం ఏరకంగా వర్తిస్తుందో పోలీసు యంత్రాంగమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజాసంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఒకవైపు కోరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న కారణం చూపి ఉపా చట్టం నమోదు చేయడం తగదన్నారు. తమను ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెడతామనే హెచ్చరిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇటువంటి చర్యలకు పూనుకోవడం విచారకరమన్నారు. దేశంలో ఎక్కడా విమర్శలు చేసినవారిపై ఉపా చట్టం ఉపయోగించిన దాఖలాలు లేవని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌, జిల్లా నాయకులు రాజు, సాయి, పవన్‌ కల్యాణ్‌, కార్తిక్‌, కౌశిక్‌, హర్ష, విజయ్‌ మనోహర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement