పోలీసులమని చెప్పి..చేతులకు బేడీలు వేసి.. దోచుకెళ్లిన ఘరానా చోరులు | - | Sakshi
Sakshi News home page

పోలీసులమని చెప్పి..చేతులకు బేడీలు వేసి.. దోచుకెళ్లిన ఘరానా చోరులు

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

కాశీబుగ్గలో బంగారం షాపులో ఘటన

షాపు యజమాని రెండు చేతులకు బేడీలు వేసిన వైనం

● షాపులో ఉన్న ముప్పావు కిలో బంగారంతో ఉడాయించిన దొంగలు

అందరూ చూస్తుండగానే దొంగతనం

రెక్కీ చేశారా..?

చోరీ జరిగిన తీరు.. దుండగుల వేగాన్ని బట్టి చూస్తే పథకం ప్రకారం వారం రోజుల ముందే రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు 4 ద్విచక్ర వాహనాల్లో దుండగులు వచ్చారని, వాటిలో ఒక ద్విచక్రవాహనానికే నంబర్‌ ప్లేట్‌ ఉందని చెబుతుండగా పోలీసులు మూడు ద్విచక్రవాహనాలు, కారులో వచ్చారని సీసీ ఫుటేజీ దృశ్యాలను బట్టి చెబుతున్నారు. కారు హైస్కూల్‌గ్రౌండ్‌ సమీపంలో పార్క్‌ చేసినట్లు తెలుస్తోంది. షాపు ఉన్న ప్రాంతంలోనే రేషన్‌ షాపు ఉండటంతో జనాలు నిత్యం అక్కడ ఉంటారు. కానీ ఆ షాపు మంగళవారం తెరవలేదు. వాస్తవానికి వేంకటేశ్వర జ్యూయలర్స్‌లో ఇద్దరు సిబ్బంది అదే రోజు సెలవు పెట్టడం గమనార్హం. షాపులో సీసీ ఫుటేజీలో కూడా ఆధారాలు చెరిపేసినట్లు, జీరో బ్యాకప్‌ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బయట మాత్రమే సీసీఫుటేజీ ఆధారంగా దుండుగులు 12.35 గంటలకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దుండగులు ఈ షాపు దగ్గరకు వెళ్లాలంటే కాశీబుగ్గ పాత జాతీయ రహదారి బంకేశ్వరి మాత గుడి సందు నుంచైనా, పాతబస్టాండు దరి సంత మైదానం నుంచి భగవతి థియేటర్‌ మీదుగా నిత్యానందనగర్‌కు వచ్చి ఉంటారా లేదంటే కారు పార్కింగ్‌ను బట్టి ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వచ్చుంటారా అన్నది తెలియాలి. వెళ్లేటప్పుడు మాత్రం మంకినమ్మ గుడి నుంచి శివాజీనగర్‌ మీదుగా పారిశ్రామికవాడ మీదుగా పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నేరుగా మొగిలిపాడు బ్రిడ్జికి చేరుకుని అక్కడి నుంచి గొప్పిలి లేదంటే కంబరిగాం మీదుగా గారబంద చేరి ఒడిశా వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయమై అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 8 మంది దుండగులు చోరీకి పాల్పడ్డారని, ఒక కారు, 3 ద్విచక్రవాహనాల్లో వచ్చారని, నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, బయట గ్యాంగుల పనే ఇదని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

పలాస/శ్రీకాకుళం క్రైమ్‌:

వీధులన్నీ తెలిసినట్టే వారు వచ్చారు.. రోడ్లన్నీ పరిచయం ఉన్నట్టుగానే బైకులు పార్క్‌ చేశారు.. ఏ సమయానికి ఏం చేయాలో ముందే అనుకున్నట్టు అరగంటలో పని పూర్తి చేశారు. ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించుకున్నట్లు వాహనాలను పోనిచ్చారు. కాశీబుగ్గలో పట్ట పగలు ఓ బంగారం షాపులోకి ప్రవేశించిన దొంగలు దర్జాగా దొంగతనం చేశారు. విజిలెన్స్‌ పోలీసులమంటూ భయపెట్టి, యజమాని చే తులకు బేడీలు వేసి దొరికింది దోచుకుని వెళ్లిపో యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. స్థానికులు, పోలీసులు చెప్పిన కథనం ప్రకారం..

సుమారు 8 ఏళ్ల కిందట త్రిపాఠి క్వార్టర్స్‌ వీధి లోని తన సొంత ఇంటి వద్దనే శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్‌ షాపును కిల్లంశెట్టి రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఈ దుకాణం ఉన్నట్టు చాలా మందికి తెలియదు. నిత్యానందనగర్‌కు ఒక మూలలో ఉంటుంది. ఎప్పటి లాగే కిల్లంశెట్టి రామకృష్ణారావు దుకాణం తెరిచి కూర్చున్నారు. తన గుమస్తా శోభన్‌బాబు(అప్పలాచారి)ని రశీదు బుక్కులు తీసుకురమ్మని పంపించారు. అతను వెళ్లిన కొద్ది సేపటికే కాశీబుగ్గ నిత్యానగర్‌ నుంచి నాలుగు బైకుల మీద మొ త్తం 8 మంది మధ్యాహ్నం 12.30 గంటలకు షాపు వద్దకు చేరుకున్నారు. బయ ట బైకులను కొద్ది దూరంలో పార్క్‌ చేసి పెట్టారు. నలుగురు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు.

ఎవరా సూడో పోలీస్‌..

అందరూ ముఖానికి మాస్క్‌లు, కర్చీఫ్‌లు కట్టుకుని స్టైలిష్‌ టీషర్టులు వేసుకోగా వారిలో ఒకరు ఖాకీ ఫ్యాంటు, వెనుక ‘పోలీస్‌’ స్టిక్కర్‌ ఉన్న టీషర్టు ధరించడం విశేషం. తాము పోలీసులమని, మీ షాపులో విజిలెన్సు తనిఖీలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. అప్పటికే యజమాని భార్య టీ తీసుకొచ్చినా తాగకుండా ఆమెను పంపించే శారు. వెంటనే యజమాని రెండు చేతులకూ బేడీలు వేసి లోపలే ఉన్న స్టోర్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఈలోగా మిగిలిన నలుగురు దుండగులు ముఖానికి మాస్కులు, చేతిలో హెల్మెట్లతో వచ్చారు.

డమ్మీ తుపాకీ చూపించి ..

యజమాని గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించగా దుండగుల్లో ఒకరు డూప్లికేట్‌ తుపాకీ ఎక్కుపెట్టి చంపేస్తామనడంతో బెదిరిపోయి మిన్నకుండిపోయారు. ఈ లో గా దుకాణంలో ఉన్న వెండిని వదిలేసి సుమారు 800 గ్రామలకు పైగా బంగారు ఆభరణాలను బ్యాగుల్లో సర్దేశారు. సరిగ్గా 12.35 గంటలకు బయటకు వచ్చేశారు. సమీపంలో పార్క్‌ చేసి ద్విచక్రవాహనాల్లో ఉడాయించేశారు. వచ్చిన దారిలో కాకుండా త్రిపాఠి క్వార్టర్స్‌ మీదుగా కాశీబుగ్గ హైస్కూల్‌ క్రీడా మైదానం పక్కనున్న మంకినమ్మ గుడి సందునుంచి వెళ్లిపోయారు.

వారు వచ్చిన బైకుల మీదుగా వెళ్లిపోయిన వెంటనే రెండు చేతులకు బేడీలతో ఉన్న రామకృష్ణారావు బయటకు వచ్చి స్థానికులకు జరిగిన విషయం చెప్పారు. ఈ విషయం కాశీబుగ్గ పోలీసులకు తెలియడంతో వెంటనే సీఐ రామకృష్ణ తన పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి వేలిముద్రల క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వా డ్‌ వచ్చి పరిశీలించారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీఎస్పీ గోవిందరావులు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు విలేకరులతో మా ట్లాడుతూ సంఘటన తీరుతెన్నులను పరిశీలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఫుటేజ్‌ వాచ్‌

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 36నిమిషాల వేళ నేరస్థలం సమీపంలో సీసీ కెమెరాల్లో నమోదైన దుండగుల కదలికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement