అలుదు.. ఆయుష్షు లేదు | - | Sakshi
Sakshi News home page

అలుదు.. ఆయుష్షు లేదు

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

● కబళిస్తున్న కిడ్నీ వ్యాధి

● ఇప్పటికే పలువురు మృత్యువాత

● డయాలసిస్‌ దశలో మరికొందరు

● సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన యువకులు

వారానికి రెండు సార్లు డయాలసిస్‌కు వెళ్తున్నా

ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించుకోగా కిడ్నీ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వారానికి రెండు సార్లు డయాలసిస్‌కు శ్రీకాకుళం వెళ్తున్నాను. మా గ్రామంలో ఇది వరకు ఎంతో మంది కిడ్ని వ్యాధితో చనిపోయారు. – యారబాటి సుందరమ్మ

ఆరోగ్యం దెబ్బతింది

కిడ్నీ వ్యాధి సోకడంతో గత 7 నెలలు నుంచి డయాలసిస్‌కు వెళ్తున్నారు. ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. డయాలసిస్‌కు వెళ్లేందుకు ఓపిక లేకుండా పోతుంది.

– కుంచి నరసయ్య, అలుదు, సారవకోట మండలం

సారవకోట: మండలంలోని అలుదు గ్రామంలోని ఎస్సీ వీధిని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. వ్యాధి బారిన పడి గత ఏడాదిన్నర కాలంలో సుమారు పది మంది వరకు మృత్యువాత పడ్డారని పలువురు ప్రస్తుతం శ్రీకాకుళం డయాలసిస్‌కు వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడున్న రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగడం వల్ల తాము వ్యాధి బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిన్నరలో 10 మంది మృతి

ఈ గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన 10 మంది ఏడాదిన్నరలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సతివాడ భాస్కరరావు, కూన మల్లేష్‌, సాగిపల్లి సింహాచలం, నాగవంశం బుడ్డెమ్మ, కూన శివ, యారబాటి మల్లేష్‌, యారబాటి గవిరేష్‌, బండి గౌరమ్మ, సతివాడ నారాయణరావులు ఈ కిడ్నీ వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ముగ్గురు శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు డయాలసిస్‌ కోసం వారానికి రెండుమూడు సార్లు వెళ్తున్నారు.

మండల గ్రీవెన్స్‌లో ఫిర్యాదు..

సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో గ్రామానికి చెందిన విజయాంబికా రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎల్‌.అప్పన్నకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలోని రెల్లి వీధిలో రక్షిత మంచినీటి పథకం ద్వారా కిడ్నీ వ్యాధి వ్యాపిస్తుందని నీటిని పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement