మూలపేటకు మంత్రుల ఉరుకులు
● వైఎస్సార్ సీపీ ఉద్యమంతో
మంత్రుల్లో చలనం
● ఎట్టకేలకు మూలపేట పోర్టును
సందర్శించిన మంత్రులు జనార్ధనరెడ్డి, అచ్చెన్నాయుడు
● నత్తనడకగా పనులు సాగుతున్నట్టుగా కన్పించిన దృశ్యాలు
● క్రెడిట్ చోరీ కోసం తీవ్ర యత్నాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక రాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 70 శాతం పనులు చేసిన మూలపేట పోర్టును గాలికొదిలేసిన టీడీపీ ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చింది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయని మూలపేట పోర్టు సందర్శనకు ఉపక్రమించారు. రాష్ట్ర భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి హుటాహుటిన పోర్టులో పర్యటించి, పనులు పరిశీలించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులే దాదాపు కన్పించాయి. నత్తనడకగా పనులు సాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. వచ్చిన తర్వాత ఏదో ఒక హడావుడి చేయాలన్న సంకల్పంతో పనుల పురోగతిపై సమీక్ష చేసి వచ్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి మూలపేట పోర్టు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలకు తెరలేపారు.
మూలపేట పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చిన దగ్గరి నుంచి నిధుల సమీకరణను వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించింది. పోర్టు పనులకు శంకుస్థాపన చేసి చకచకా పనులు చేపట్టారు. దీనికొక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ముమ్మరంగా పనులు సాగుతున్న వేళ ఎన్నికలు రావడం, ఇంతలో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవ్వడం, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏడాదిన్నరకు పైగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కనే అన్న చందంగా ఉండిపోయాయి. కానీ, మూలపేట పోర్టు ఘనతే తమదే అని చెప్పుకోవడం మొదలెట్టారు. కేంద్ర మంత్రి దగ్గరి నుంచి చంద్రబాబు వరకు క్రెడిట్ చోరీకి యత్నించారు. ఎప్పుడైతే మూలపేట పోర్టు కోసం వైఎస్సార్‌సీపీ గళమెత్తిందో అప్పటి నుంచి పోర్టువైపు ప్రభుత్వం చూడటం మొదలెట్టింది. ‘మన మూలపేట పోర్టుకు పోదాంపదండి’ కార్యక్రమం తర్వాత ప్రభుత్వంలో మరింత కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియడంతో భోగాపురం ఎయిర్‌పోర్టు మాదిరిగానే ఫొ టోలతో పోజులిచ్చి, తామే పనులు చేపడుతున్నా మని చెప్పుకోవడానికి పోర్టు సందర్శనకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా సోమవారం ఇద్దరు మంత్రులు, అధికారులు నిర్మాణంలో ఉన్న పోర్టు ను పరిశీలించి, నిర్వాహకులతో సమీక్షించారు. వ చ్చే నవంబర్ కల్లా పూర్తి చేస్తామని ప్రకటన ఇ చ్చారు. భూసేకరణ సమస్య అంటూ తాత్సారానికి గల కారణాలు కూడా చెప్పేశారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై నిందలు వేసి వచ్చేశారు.


