పింఛన్‌ సొమ్ము ఇప్పించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ సొమ్ము ఇప్పించాలని వినతి

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

నందిగాం: జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన పింఛన్‌ మొత్తాన్ని తక్షణం చెల్లించి ఆదుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు టి.వైకుంఠరావు కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది డిసెంబరు నుంచి మార్చి 2026 వరకు నాలుగు నెలలుగా పింఛన్‌ ఇవ్వకపోవడంతో జిల్లాలోని 52 కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులు పండగ పూట కూడా అర్ధాకలిలో ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి, ఇంటి పన్నుల నుంచి వచ్చిన లైబ్రరీ సెస్‌ 8 శాతం వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలు ఈ లైబ్రరీ సెస్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేసేలా జిల్లా అధికారులు, కలెక్టర్‌ చొరవ చూపి పెన్షన్లు అందేలా చూడాలని ఆయన కోరారు.

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలికి గాయాలు

టెక్కలి రూరల్‌: స్థానిక రామదాసుపేటకి చెందిన లండ లక్ష్మమ్మ అనే వృద్ధురాలు సోమవారం విద్యుత్‌ షాక్‌కు గురై గాయాలపాలైంది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆమె ఇంటి వెనుక ఒక విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. సోమవారం ఉదయం ఇంటి మేడపై బట్టలు ఆరబెట్టేందుకు వెళ్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌కి తాకుతూ ఉన్న ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో షాక్‌ కొట్టింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పలాసలో..

పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని గాంధీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిలో విద్యుత్‌ పనులు చేస్తుండగా సూదికొండకు చెందిన సీతం మురళి అనే యువకుడు అకస్మాత్తుగా విద్యుత్‌ షాక్‌కు గురై గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

టెక్కలి రూరల్‌: స్థానిక చిన్న బ్రాహ్మణ వీధి సమీప జాతీయ రహదారిపై సోమవారం ఒక కారు అదుపు తప్పి రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బరంపురం నుంచి నిక్కి మహాంతి తన కుమారుడు కేదార్‌ మహంతితో కలసి కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్‌ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారిపోవడంతో కారు రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 19 దూడలను నరసన్నపేట పోలీసులు మండలం తామరాపల్లి వద్ద పట్టుకున్నారు. నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ తెలిపిన వివరాలు మేరకు నారాయణవలస సంత నుంచి 19 దూడలను ఒక వ్యాన్‌లో గుంటూరుకు తరలిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు తామరాపల్లి వద్ద కాపు కాచి సోమవారం సాయంత్రం పట్టుకున్నామన్నారు. పశు రవాణా నిబంధనలు ఉల్లంఘించినందుకు దీనిపై కేసు నమోదు చేసి వ్యాన్‌ను సీజ్‌ చేశామని దూడలను గోశాలకు తరలించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement