నరసన్నపేట నుంచి పాతపట్నం వెళ్లే జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ రోడ్లపై మొక్కజొన్న పంటను ఆరబెట్టుకుంటున్న దృశ్యమిది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
రోడ్లపైనే మొక్కజొన్న బస్తాలు పెట్టుకుని ప్రభుత్వ కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. పండిన పంటను కాపాడుకోవడానికి పాట్లు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని మొక్కజొన్న రైతులు రోడ్డున పడే స్థితికి వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా అయినా రైతులకు ఏ మాత్రం మద్దతు దక్కడం లేదు. మొక్కజొన్న రైతులను నిర్లక్ష్యంగా గాలికొదిలేస్తున్నారు. శాఖా పరమైన కనీసం చర్య లు తీసుకోవడం లేదు. జిల్లాలో 87,821 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంతా బాగున్నా పండిన పంటను కొనుగోలు చేసే నాథుడు లేకుండా పోయాడు. పండిన పంటను గ్రామాలకు తీసుకొ చ్చి, రోడ్లపై ఆరబెట్టుకుని, కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాల్సి వస్తోంది. క్వింటా మొక్క జొన్న కు రూ. 2400 మద్దతు ధర ప్రకటించారు. కానీ, కొనుగోలుచేసేందుకు కేంద్రాలు ప్రారంభించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి, రైతుల నుంచి కొనుగోలు చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన ప్రకటనలు మాటలకే పరిమతమయ్యాయి. ఇంతవరకు జిల్లా లో ఒక్క కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు.
ప్రభుత్వంపై ఆగ్రహం..
అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు ఖరీఫ్‌లోనూ, ఇటు రబీలోనూ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకనా అని ఆవేదన చెందుతున్నారు. విత్తనం దగ్గరి నుంచి పంట విక్రయం వరకు తమకు కష్టాలు తప్పడం లేదని, ఏ ఒక్క నేత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళారుల బారిన రైతన్న
పండిన పంటను ప్రభుత్వం ఎంతకీ కొనుగోలు చేయకపోవడంతో ఇంట్లో దాచుకోలేక రోడ్డుపైనే ఆరబెట్టుకుంటున్నారు. ఆక్కడ మూటలు కట్టి ఉంచుతున్నారు. రాత్రి పూట దొంగతనాలు జరుగుతాయేమోనని ఆ రోడ్లుపైనే కాపలా ఉంటున్నారు. ఎంత వేచి చూసినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ. 1500 నుంచి రూ.1700 మించి ఇవ్వలేమని, కావాలంటే ఇవ్వండి లేదంటే వదిలేసుకోండి అని ఖరాఖండీగా చెప్పేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో క్వింటాకు రూ.700కు పైగా రైతులు నష్టపోతున్నారు. దీంతో పెట్టుబడులు సైతం రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాలతో రోడ్డుపైన ఆరబెట్టిన మొక్కజొన్న తడిచి ముద్దవుతోంది. దీని వల్ల తేమ శాతం ఎక్కువై, తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వస్తోంది.
రోడ్డున పడిన మొక్కజొన్న రైతులు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం
రైతులకు దక్కని మద్దతు ధర
తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన దుస్థితి
క్వింటాకు రూ.700కు పైగా నష్టపోతున్న వైనం


