శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పూలే జయంతి ఏప్రిల్ 11 నుంచి అంబేడ్కర్ జయంతి 14వ తేదీ వరకు ‘దళిత, పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటిద్దాం’ అని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియం అంబేడ్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అంబేడ్కర్, ఫూలే సామాజిక ఉద్యమాలు జరపడం వల్లే మనుస్మృతి పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. ఐక్యంగా ఉండి రాజ్యాంగంలో ఉన్న హక్కులు దళిత పీడిత కులాల పేద ప్రజలకు హక్కులు చేరే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, నల్లబారికి శ్రీను, గురుమూర్తి, రాకోటిరాంబాబు, కె.కాళిదాసు, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.దానేసు, దానయ్య, వైకుంఠరావు, దేశభక్త ఉద్యమం నాయకులు సాలిన వీరా స్వామి, జె.వెంకటరావు, దాలినాయుడు, రైతుకూలీ సంఘం నాయకులు బైరి కూర్మారావు, బొత్స రమణ, బైరి. పాపారావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని పంచాయతీల్లోనూ
ప్రత్యేక అధికారుల నియామకాలు
అరసవల్లి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోందని, ఈమేరకు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నియామక చర్యలు చేపట్టామని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.గోపిబాల ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలకు గాను గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో సర్పంచ్ ఎన్నికలు జరగని 15 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన జరుగుతూ వస్తోందని, ఇప్పుడు మిగిలిన పంచాయతీల్లోనూ ఈ ప్రత్యేకాధికారుల పాలన మొదలైందని వివరించారు. ఈనెల 2వ తేదీతో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిందని, అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు, ఎన్నికల ప్రక్రియ జరిగినంత వరకు పంచాయతీల్లో కార్యకలాపాలు, ప్రజల సౌకర్యార్థం చర్యల నిమిత్తం అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం తదితర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మండల స్థాయి అధికారులతో ఈ ప్రత్యేకాధికారులను నియమించామని, అయితే చిన్నచిన్న పంచాయతీలను కలుపుకుంటూ మొత్తం 897 పంచాయతీలకు మొత్తం 335 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించామని వివరించారు.
డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్
హిరమండలం: మండలంలోని మర్రిగూడ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్‌గా పనిచేస్తున్న కె.బాలరాజును సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం సస్పెండ్ చేశా రు. వార్డెన్ మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని ఫిర్యాదుపై స్పందించిన యంత్రాంగం విచారణకు ఆదేశించింది. డిప్యూటీ డీఈఓ, ఏటీడబ్లూఓ విచారణలో వార్డెన్ మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడం, అదే విధంగా విచారణ సమయంలో కూడా మద్యం సేవించి ఉండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వార్డెన్‌ను ఐటీడీఏ పీఓ సస్పెండ్ చేశారు.


