శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో పోస్టుమార్టం కష్టాలు ఎదురవుతున్నాయి. పుట్టెడు దుఖంలో ఉండే రోగి బంధువులకు చెప్పలేని కష్టాలు కలుగుతున్నాయి. ఇంత పెద్ద ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన మార్చురీ అసిస్టెంట్లు(తోటి) లేరంటే నమ్మాల్సిందే. వైద్య కళాశాలకు అనుబంధ వైద్యశాలగా ఉండి 950 పడకలకు స్థాయి పెరిగినా తోటీలను మాత్రం నియమించుకోలేకపోయారు. మార్చురీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నలుగురు మార్చురీ అసిస్టెంట్లు పనిచేస్తుండేవారు. వీరిలో ఇద్దరు పదవీ విరమణ చేయగా, ఆ పోస్టులు తిరిగి భర్తీ చేయలేదు. మిగిలిన ఇద్దరికీ పోస్టుమార్టం పనుల్లో పెద్దగా అనుభవం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నా యి. కొన్ని రోజుల కిందట బుడుమూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంత రం బంధువులకు అప్పగించేందుకు 24 గంటలకు పైగా పట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. మృతుని బంధువులు సాయం చేయడంతో శవ పరీక్ష పూర్తి చేయగలిగారు. దాదాపు నెల రోజులు గా పరిస్థితి ఇలాగే ఉంది. మార్చురీలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్లకు పెద్దగా అనుభవం లేకపోవడం, కాస్తంత బెరుకు ఉండడంతో పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వ్యక్తికి చెందిన బంధువులను అనధికారికంగా తీసుకువచ్చి వీరి ద్వారా పోస్టుమార్టం చేయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇష్టారీతిన పోస్టుమార్టం చేయడంతో మృతదేహాలు ఛిన్నాభిన్నమవుతున్నాయనే వా దన ఉంది. పోస్టుమార్టం కోసం చెల్లింపులు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వారిని పోగొట్టుకొని మృతదేహాన్నైనా సక్రమంగా ఇంటికి తీసుకువెళదాం అనుకునే వారికి అది కూడా సాధ్యం కావడం లేదు. రిమ్స్‌లో నిత్యం మూడు నుంచి ఐదు వరకు పోస్టుమార్టంలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అనుభవజ్ఞులైన మార్చురీ అసిస్టెంట్లు లేకపోవడం విడ్డూరమైతే, ఉన్న వారిని అకారణంగా తొలగించడం విచారకరం.
తొలగింపులతోనే ఇబ్బంది
రిమ్స్‌లో మార్చురీలో పనిచేస్తున్న ఇద్దరు అనుభవజ్ఞులైన పారిశుద్ధ్య కార్మికులతో పాటు మరో 22 మంది పారిశుద్ధ్య కార్మికులను మార్చి 8వ తేదీ నుంచి విధుల నుంచి కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తొలగించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు రూ.16,000 వేతనం ఖాతాలకు జమ చేయాలని, మిగిలిన రూ.2500లు పీఎఫ్, ఈఎస్‌ఐలకు చెల్లించాలని కోరడమే ఇందుకు కారణం. అలాగే సంస్థ ప్రతినిధులు ఓ అంగీకార పత్రంపై సంతకం చేయాలని కోరగా, అందులో ఉన్న కొన్ని షరతులు నచ్చక ఈ 24 మంది సంతకాలు చేసేందుకు నిరాకరించారు. ఈ షరతుల్లో ప్రధానమైనది సంస్థ కాంట్రాక్టు పొందిన ఏ ఆస్పత్రికై నా భారత దేశవ్యాప్తంగా వెళ్లేందుకు అంగీకరించాలని పొందుపరచడం. దీన్ని తిరస్కరించడం కూడా ఈ 24 మంది తొలగింపునకు కారణమైంది. వీరికి ఐదు నెలలు జీతాలు కూడా చెల్లించకుండా విధుల నుంచి తొలగించి, మీరు తమ సంస్థ ప్రతినిధులు కా దని చెప్పడంతో జిల్లా అధికారులు, రిమ్స్ అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి వినతి పత్రాలు సమర్పించారు. విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించినా కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
రిమ్స్ వైద్య కళాశాలలో భర్తీ కాని మార్చురీ అసిస్టెంట్ పోస్టులు
కొన్ని రోజుల కిందట ‘తోటీ’లను విధుల నుంచి తొలగింపు
పోస్టుమార్టం నిర్వహణలో
ఇబ్బందులు
అనధికారిక వ్యక్తులతో పోస్టుమార్టం పనులు చేయిస్తున్న వైనం


