రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా సంవత్సరమంతా పాటించాల్సిన బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప రవాణా కమిషనర్ విజయ సారథి అధ్యక్షతన శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే ప్రమాదాల నివారణ సాధ్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పెదపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఎస్. సోని (8వ తరగతి) ప్రథమ బహుమతి సాధించగా, బి.ధనలక్ష్మి (9వ తరగతి) ద్వితీయ, బి.హాసిని (9వ తరగతి) తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు. ఈ నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆర్టీఓ ఆర్.అనిల్, మోటార్ వాహన తనిఖీ అధికారులు (ఎం.వి.ఐ) గంగాధర్, కె.శిరీష, ఎస్.శిరీష, జి.శ్రీధర్, డి. సంజీవరావు, ఆర్.గోవిందరాజు, వై.శ్రీనివాస్ ఇతర సిబ్బందిని వారి నిబద్ధతకు గాను అభినందనలు తెలిపారు.


