క్రిస్మస్ సెలవులకు వెళ్లి వస్తుండగా..
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో పదో తరగతి చదువుతున్న మట్టా ప్రణీత్‌కుమార్(15) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రి గాయాలపాలయ్యాడు. క్రిస్మస్ సెలవుల కోసం సోంపేట మండలం మామిడిపల్లిలోని తన ఇంటికి వెళ్లి తండ్రి హేమంత్‌రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూల్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ప్రణీత్‌కుమార్ తండ్రి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు కంచిలి గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతిపై గురుకుల ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు, అధ్యాపక, ఉపాధ్యాయ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


