లీజు ముప్పు!
నౌపడ ఉప్పు..
● భూముల లీజును పునరుద్ధరించని కేంద్ర ప్రభుత్వం ● సాగుకు దూరమవుతున్న ఉప్పు రైతులు ● వలసబాటలో కార్మికులు
సంతబొమ్మాళి : నవరుచులకు తల్లి నౌపడ ఉప్పు గల్లి అనే నానుడి నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమేపి తగ్గిపోయి పరిశ్రమ అంతరించే స్థితికి చేరుకుంది. గతంలో ఉప్పు దిగుబడి లక్షల టన్నుల్లో ఉంటే నేడు వేలకు పడిపోయింది. గతంలో మూడు వేలకు పైగా ఎకరాల్లో ఉప్పు విస్తీర్ణం చేయగా నేడు సగానికి పడిపోయింది. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, పాలనాయుడుపేట, కె.లింగూడు, సీతానగరం, మూలపేట, మర్రిపాడు, భావనపాడు, సెలగపేట, ఆర్.సున్నాపల్లి, యామలపేట, కేశునాయుడుపేట గ్రామాలకు చెందిన రెండు వేలు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించేవి. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గి ఉప్పు రైతులు, కార్మికులు వలస బాటపడుతున్నారు. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో వాటిని సన్నకారు, చిన్నకార రైతులు సాగుచేసేవారు. ఈ లీజు 2018తో ముగిసిపోయింది. లీజును పునరుద్ధరించాలని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వినతులు అందించారు. ఈ నేపథ్యంలో భూముల లీజుకు సంబంధించి 2020లో కేంద్రం సబ్ కమిటీ వేసింది. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయినా నేటి వరకు లీజును అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో ప్రస్తుతం ఉప్పు పంట 1500 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. పనులు లేక ఉప్పురైతులు, కార్మికులు వలసబాట పడుతున్నారు.
గతమెంతో ఘనం..
నౌపడ ఉప్పు పరిశ్రమ ఒకప్పుడు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో, దేశంలో రెండో స్థానంలో ఉండేది. రైతులు ప్రతి ఏటా డిసెంబర్‌లో ఉప్పు సాగును ప్రారంభించి జూలై మొదటి వారం వరకు కొనసాగించేవారు. ప్రతి 40 రోజులకు ఒక సారి దిగుబడి వచ్చేది. ఆ సమయంలో ఇక్కడ ఎంతో సందడిగా ఉండేది. ఇక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఉప్పు రవాణా జరుగుతుండేది. రైల్వే రవాణా ఖర్చులు తక్కువగా ఉండటంతో అప్పట్లో రైతులకు ఉప్పుసాగు లాభదాయకంగా ఉండేది. అయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ తొలగించడంతో నౌపడ ఉప్పు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా ఉప్పును రవాణా చేయడంతో ఖర్చులు పెరిగాయి. అయినా రైతులు సాగుకు వెనుకడుగు వేయలేదు. భూముల లీజును కేంద్రం రెన్యువల్ చేయకపోవడం వల్లే సమస్య మొదలైంది. కొంతమంది రైతులు ఉప్పు సాగుకు దూరమై కుటుంబాలతో వలస బాటపట్టారు. ఫలితంగా ఉప్పు పరిశ్రమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైను ఉప్పు భూములు మూలపేట పోర్టుకు అప్పగించడంతో ఆయా భూముల్లో పరిశ్రమల స్థాపనకు పలుమార్లు అధికారులు పరిశీలించడంతో ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఉప్పు సంఘ నాయకులు, రైతులు అంటున్నారు. నవరుచులు అందించే నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు అంతరించే స్థాయికి చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి లీజును పునరుద్ధరించాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.
తరతరాలుగా ఉప్పును సాగుచేస్తూ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఉప్పు పంటకు ధర ఉన్నా లేకపోయినా దీనినే నమ్ముకున్నాం. నేడు ఉప్పు పంట సాగు ప్రశ్నార్థకంగా మారడంతో వలసబాటపట్టాల్సి వస్తోంది. ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– కర్రి భాస్కరరావు,
ఉప్పు రైతు, నౌపడ
ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తేనే ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. 2018తో లీజు పూర్తయి తర్వాత కేంద్రం సబ్ కమిటి వేసినా ఇంతవరకు చర్యలు లేవు. నౌపడ ఉప్పు పరిశ్రమ పరిరక్షణ కోసం కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– పిలక రవికుమార్‌రెడ్డి, కార్యదర్శి,
సన్నకార ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం, నౌపడ
నౌపడలో అరకొరగా ఉప్పు మడులు
లీజు ముప్పు!
లీజు ముప్పు!
లీజు ముప్పు!
లీజు ముప్పు!


