దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలి
వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పనకు ఉద్దేశించిన వికలాంగుల హక్కుల(ఆర్‌పీడబ్లూడీ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మోహన్‌రావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామ సచివాలయాల ద్వారా అందించాలన్నారు. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సుస్థిర అవకాశాలను కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపతిరావు లక్ష్మీ, పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు బి.యర్రన్నాయుడు, డి.రమణమూర్తి, కె.చంద్రశేఖరరావు, పి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.


