కాంట్రాక్టర్లను తొలగించాలి
శ్రీకాకుళం: నగరంలోని రిమ్స్ ఆస్పత్రిలో కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్లను తక్షణమే తొలగించాలని ఐఎఫ్‌టీయూ నాయకులు సవలపురపు కృష్ణవేణి, గొల్లపల్లి రాజులు, బగాది శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రిమ్స్ ప్రధాన ప్రవేశద్వారం వద్ద అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెక్యూరిటీ గార్డులకు మూడు నెలలుగా ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లించకుండా చట్టబద్ధమైన హక్కులను కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం కాలరాస్తోందని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులను నిత్యం వేధిస్తూ, సెలవులు మంజూరు చేయకుండా 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు కలిగిస్తున్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసు లిమిటెడ్ యాజమాన్యంపై కూడా రిమ్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు, రిమ్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన కోర్కెల సాధన కోసం ఈనెల 29, 30, 31 తేదీల్లో రిమ్స్ గేటు వద్ద నిరాహార దీక్షలు చేపడుతామని తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు డి.గణేష్, మామిడి క్రాంతి, జోగి వెంకటరమణ, దామోదర రవికుమార్, దమ్ము సింహాచలం, సూర్యకాంతం, శశిరేఖ, ససంధ్య, రాజేశ్వరి, జయప్రద, ప్రభ, విజయ, శ్రీనివాస్, రామారావు, రాజేంద్రప్రసాద్, సరస్వతి, తంగి శ్రీను, చిరంజీవి, హైమారావు తదితరులు పాల్గొన్నారు.


