104 ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు
● సిబ్బంది కొరతతో అదనపు భారం
● జీతాల్లో కోతలతో అవస్థలు పడుతున్న ఉద్యోగులు
అరసవల్లి:
పేదల పాలిట సంజీవని 104 అంబులెన్స్ సిబ్బంది సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. అరకొర సిబ్బంది, రోజుకు పది గంటలకు పైగా విధులు, అదనపు పని ఒత్తిడి, కనీసం సెలవులు ఇవ్వకుండా వేధింపులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉండడంతో ఉద్యోగులు యాతన పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. యాజమాన్యం వేధింపులను ఆపాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనలకు దిగుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది
జిల్లాలో 30 మండలాలకు మొత్తం 104 మొబైల్ వాహనాలు 51 (బఫర్ 1) వరకు ఉన్నాయి. 102 మంది ఉద్యోగులకు నిబంధనల ప్రకారం సెలవులు ఇవ్వకపోవడంతో పాటు బఫర్‌లు కూడా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం తప్పడం లేదు. బఫర్ కింద ప్రతి డివిజన్‌కు ఒకరు చొప్పున జిల్లాలో మొత్తం నలుగురు డ్రైవర్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు (డీఈఓ) ఉండాల్సి ఉండగా ప్రభుత్వ ఒప్పందాలను కూడా పక్కన పెట్టి మరీ పూల్ సిస్ట మ్ ద్వారా ఏ రోజు వేతనం ఆ రోజే ఇచ్చేలా వ్యవహారాన్ని భవ్య యాజమాన్యం నడిపిస్తున్నారని ఉద్యోగుల సంఘం ఆరోపిస్తుంది.
సెలవులివ్వకుండా హక్కులను హరిస్తూ..
ఉద్యోగులకు విధి నిర్వహణలో సెలవులను పొందడం కూడా హక్కులో భాగమే అయినప్పటికీ భవ్య యాజమాన్య వైఖరి మాత్రం ఈ హక్కులను హరి స్తూ ఉద్యోగులకు వేధిస్తోంది. మహిళలకు ఆయితే ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లోనూ సెలవులివ్వకపోవడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలకు ఇవ్వాల్సిన క్యాజువల్ లీవ్‌తో పాటు 20 రోజులకు ఇవ్వాల్సిన ఒక ఎర్న్‌డ్ లీవ్‌ను కూడా ఇవ్వకుండా యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు వేదన చెందుతున్నారు. సెలవు రోజున తగిన జీతాన్ని కూడా కట్ చేసేలా చర్యలు చేపడుతున్న యాజమాన్యం వైఖరిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత ఏడు నెలలుగా ఉద్యోగులకు నియామక పత్రాలతో పాటు పేస్లిప్‌లను కూడా యాజమాన్యం ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. ఇదే నెపంతో స్థానిక అఽఽధికార పార్టీకి చెందిన నేతల సిఫారసులతో కొత్తవారిని నియమించుకునేలా వెసులు బాటు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో సంస్థ ఇచ్చి న జీతాల కంటే ఈ భవ్య సంస్థ ఇచ్చిన జీతాలు తగ్గిపోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. సీనియారిటీని కూడా ప్రాధాన్యతగా తీసుకోకుండా యా జమాన్యం ఉద్యోగులకు మానసికంగా అవస్థలకు గురిచేయడంతో ఉద్యోగులంతా ఆందోళనకు దిగా రు. తాజాగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తమ అవస్థలపై భవ్య సర్వీసెస్‌పై మండిపడుతూ ఆందోళనలకు కార్యాచరణ చేపడుతున్నారు.
జీతాల్లో కోతలు పెడుతున్నారు
104 వాహనాల్లో ఉద్యోగుల నియామకాలను 2008లో చేపట్టారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన జీతం కంటే ఇప్పుడు రూ.700 తక్కువగా వస్తోంది. సెలవు పెడితే రోజు జీతం రూ.860 కట్ చేస్తున్నారు. అదే రోజు పనిచేసిన పూల్ సిబ్బందికి దినసరి వేతనంగా రూ.500 ఇచ్చేస్తున్నారు. నెలకో సిఎల్, 20 రోజుల కొక ఈఎల్ ఉండాల్సిన నియమాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
– చల్లా నారాయణరావు,
జిల్లా 104 వాహన డ్రైవర్లు సంఘ అధ్యక్షుడు
వేధింపులు ఆపాలి
భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు అన్ని విధాలుగా దగా చేస్తోంది. పూర్తి వేతనాలను చెల్లించకపోగా నిందలతో వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు. ఎలాంటి సెలవులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తు న్నారు. గట్టిగా అడిగిన వారికి వేటు వేసేలా అడుగులు వేస్తున్నారు. – ధర్మాన కిరణ్‌కుమార్,
కార్యదర్శి, 104 ఉద్యోగుల సంఘం
104 ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు


