క్రీడా స్థలంతో ఆటలు
● మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం ధారాదత్తానికి యత్నాలు
● గత ప్రభుత్వ హయాంలో ఖేలో ఇండియా క్రీడా గ్రామం నిర్మాణానికి 33.38 ఎకరాలు సేకరణ
● ఇందులో పది ఎకరాలు క్రికెట్ అసోసియేషన్‌కు ఇచ్చేందుకు యోచన
● గతంలో ఆమదాలవలసలో తీసుకున్న స్టేడియం స్థలాన్ని గాలికి వదిలేసిన క్రికెట్ అసోసియేషన్
శ్రీకాకుళం: జిల్లా కేంద్రం వద్ద పాత్రుని వలస సమీపంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాత్రుని వలస సమీపంలో 33.38 ఎకరాల భూమిని సేకరించి ఖేలో ఇండియా నిధులతో క్రీడా గ్రామాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగించారు. ఈ స్థలంలో హాకీ సింథటిక్ కోర్టుతో పాటు అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్‌లను నిర్మించాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ మ ల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అన్ని క్రీడలకు పనికి వచ్చేలా సింథటిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించి ఇందుకు సంబంధించిన అంచనాలను సైతం సిద్ధం చేశారు. ఇక్కడ ఖేలో ఇండియా క్రీడా గ్రామం మంజూరైతే ఇక్కడే బాల బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు శిక్షకులకు వసతి గృహాలు ఫిజియోథెరపీ సెంటర్లు మల్టీ జిమ్ కేంద్రాలు ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్ బాల్ కోర్టులు నిర్మించేలా అంచనాలు పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇంతలో ఎన్నికలు రావడం వల్ల ఇది పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా ఈ స్థలంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కన్ను పడింది. ఇందులో తమకు 10 ఎకరాలు కేటాయించాలని, స్టేడియం నిర్మాణాన్ని చేపడతామని అధికారులకు ప్రతిపాదించారు.
అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు తమ కు ఉన్న సాన్నిహిత్యంతో అధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీనికి ఓ ప్రజా ప్రతినిధి కూడా వత్తాసు పలకడంతో స్థలం కేటాయించేందుకు అధికారులు నిర్ణయించారు. కొందరు క్రీడాకారులు విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నా యుడు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన ఇటీవలే క్రీడా గ్రామ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సేకరించి క్రీడా ప్రాధికార సంస్థకు కేటాయించిన స్థలాన్ని క్రికెట్ అసోసియేషన్‌కు ఎందుకు ఇవ్వడం అని, పక్కనే ఉన్న రైతులు 14 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండడంతో వారి నుంచి క్రికెట్ అసోసియేషన్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఖేలో ఇండియా నిధులు మంజూరయ్యేలా కేంద్రం స్థాయిలో కృషి చేస్తానని, ఆ నిధులు మంజూరైతే ఇక్కడ క్రీడా గ్రామాన్ని నిర్మించుకోవచ్చని కూడా కేంద్రమంత్రి అధికారులకు ఈ స్థల ఆవరణలోనే చెప్పారు. కానీ దీన్ని కూడా కొందరు అధికారులు బేఖాతరు చేస్తూ పది ఎకరాల స్థలాన్ని క్రికెట్ అ సోసియేషన్‌కు లీజు పద్ధతిపై కేటాయించేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆమదాలవలసలోని నందమూరి తారక రామారావు గ్రీన్ ఫీల్డ్ క్రీడా ప్రాంగణాన్ని లీజుకి తీసుకొని గాలికి వదిలేసింది. ఈ ప్రాంగణంలో రెండు కోట్ల నిధులతో నిర్మించిన భవనాన్ని సైతం కూల్చివేసిన అనంతరం స్థలాన్ని వదిలివేశారని, దీన్ని పరిగణనలోకి తీసుకొని అయినా స్థలాన్ని కేటాయించవద్దని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు వాస్తవమే
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు 10 ఎకరాలు స్థలం ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్న విషయం నిజమే. క్రికెట్ అసోసియేషన్‌తో భూమిని కొనుగోలు చేయించాలని కేంద్రమంత్రి చెప్పిన విషయం కూడా వాస్తవమే. అధికారుల ఆదేశాల మేరకు కొందరు క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఒత్తిడికి తలొగ్గుతారో వేచి చూడాల్సిందే.
– మహేష్, డీఎస్‌డీఓ


