● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నాగుపాము
టెక్కలి రూరల్:
ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గురువారం ఉదయం ఒక నాగుపాము హల్‌చల్ చేసింది. ఆస్పత్రి లోపల నాగుపాము కనిపించడంతో ఆస్పత్రిలోని రోగులతో పాటు సిబ్బంది సైతం భయాందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
ఆస్పత్రిలోని మొదటి అంతస్తు 44వ నంబర్ రూమ్‌లో ఉన్న జనరల్ ల్యాబ్ తలుపులను గురువారం ఉదయం తెరిచే సరికి అక్కడ సిబ్బందికి పాము బుసలు కొడుతూ కనిపించింది. చాలాసేపటి వరకు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోయారు. చివరకు ఆ పాము ల్యాబ్ రూము సమీపంలో ఒక రేకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో దూరే ప్రయత్నం చెయ్యడంతో సిబ్బంది దాన్ని పట్టుకుని ఆస్పత్రికి కొంత దూరంలో విడిచి పెట్టేశారు. పాము మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పాము సమీప వార్డుల్లోకి వెళ్లి ఉంటే పరిస్థితి ఏమిటని రోగులు ఆందోళనకు గురయ్యారు.


