ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మండల వీధిలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్‌ఐ – 2 బొడ్డేపల్లి రామారావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు జడే కృష్ణ(39) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి మండల వీధిలో నివసిస్తూ పాల వ్యాపారం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒక ప్రమాదంలో అతడి తలకు గాయమవ్వడంతో మతిస్థిమితం సరిగా ఉండేది కాదు. వణుకు ఎక్కువగా రావడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఒక్కోసారి 2, 3 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య లక్ష్మి మందలించిందని, బయటకు వెళ్లిన కృష్ణ 3 రోజులైనా ఇంటికి మరలా రాలేదు.
పొదల్లో మృతదేహం గుర్తింపు
జడే కృష్ణ తన ఆవులను ఒక పాకలో కట్టేవాడు. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం కృష్ణ భార్య పాలు తీద్దామని పాక వద్దకు వెళ్లింది. దీనిలో భాగంగా ఆవు దూడకు కట్టిన తాడు విప్పిన వెంటనే గుబురుగా ఉన్న నిర్మానుష్య పొదల వైపు దూడ వెళ్లింది. దూడను వెతుక్కుంటూ వెళ్లిన లక్ష్మికి చెట్టుకు వేలాడుతూ పోల్చలేని విధంగా ఉన్న తన భర్త కృష్ణ మృతదేహం కనిపించడంతో లబోదిబోమంది. వెంటనే పోలీసులకు సమాచారమందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


