విధ్వంస కాండ
కొండలపై
● రాత్రి సమయాల్లో తరలిపోతున్న కంకర
● పలాస నియోజకవర్గంలో కొండలను కొల్లగొడుతున్న అక్రమార్కులు
● అధికారాన్ని అడ్డం పెట్టుకొని
ప్రకృతి వనరులు దోచేస్తున్న వైనం
● సోషల్ మీడియాలో
వైరల్ అవుతున్న వీడియోలు
● అయినా నోరు మెదపని అధికారులు
అక్రమ తవ్వకాలతో తరిగిపోతున్న బెండి కొండ
కఠిన చర్యలు తప్పవు
ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఎంఐజీ లే అవుట్, ఇతర అభివృద్ధి పనుల కోసం మాత్రమే అనుమతి ఇచ్చాం. ఈ పనులు మినహా ఇతర ఏ పనులకై నా అనుమతి లేకుండా కంకర తవ్వకాలు జరిపి అక్రమంగా తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులు, సిబ్బందితో నిఘా పెడుతున్నాం. అక్రమంగా మైనింగ్ చేసి పట్టుబడితే ఉపేక్షించేది లేదు. – వెంకటేష్, ఆర్డీఓ, పలాస
వజ్రపుకొత్తూరు రూరల్:
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు.. పలాస నియోజకవర్గంలో ఆ కూర్చుని తింటున్నదెవరో గానీ కొండలు మాత్రం కరిగిపోతున్నాయి. కాసింత కంకర ఉన్నా, ఏ మాత్రం గ్రావెల్ కనిపించినా కొండకు గుండు కొట్టే వరకు కొందరు ఊరుకోవడం లేదు. రాత్రి సమయంలో కొండలను కొల్లగొడుతున్న భారీ వాహనాలు నంబర్లతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఒక వైపు పచ్చని ఉద్దానం, తీర ప్రాతం, మెట్టు, పల్లపు ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలతో పలాస రమణీయంగా ఉంటుంది. కానీ ఓ వైపు తీరం వెంబడి అక్రమంగా ఇసుకను తోడేస్తుంటే.. మరో వైపు యథేచ్ఛగా కొండలకు తవ్వి కంకర కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది.
బరితెగించిన కంకర మాఫియా
పలాస నియోజకవర్గంలో ఉన్న బెండి కొండ, తాడివాడ కొండ, అనంతగిరి కొండ, ఉజ్జిడి మెట్ట, రాజగోపాలపురం, రట్టికొండ, పిడిమందస, లొద్దబద్ర, కేదారపురం, వాసుదేవపురం కొట్ర ఆనంద్ క్వారీ, సూది కొండ, నెమలి కొండతో పాటు మరి కొన్ని కొండలను పగలు,రాత్రి అని తేడా లేకుండా అక్రమార్కులు గుల్ల చేసేస్తున్నారు. బెండి కొండ జగనన్న కాలనీ వద్ద అక్రమ తవ్వకాలతో తాగునీటి పైపులు, కుళాయిలు సైతం ధ్వంసమయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బరితెగించి కంకర మాఫియాను సాగిస్తూ యంత్రాలతో కొండలను తవ్వి ప్రకృతి వనరులు కొల్లగొడుతున్నారు.
ఎందుకంత మౌనం..?
కళ్ల ముందే ప్రకృతి సంపదను అక్రమార్కులు దోచుకుంటుంటే తమకేమీ పట్టనట్లుగా వ్యవహ రిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కొండలను తవ్వడానికి ఎవరు అనుమతి ఇచ్చారు..? ఒకవేళ అధికారులు అనుమతి ఇస్తే నిశిరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా ఈ తవ్వకాలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పుట్టగొడుగుల్లా లే అవుట్‌లు
పలాస–కాశీబుగ్గ, పూండి, మందస, హరిపురంతో పాటు మారు మూల గ్రామాల్లో సైతం పుట్టగొడుగుల్లా లే అవుట్‌లు వెలుస్తున్నాయి. అదే రీతిలో అక్రమ కంకర తరలింపు కూడా జోరుగా సాగుతోంది. ప్రధానంగా లే అవుట్ యజమానులు రాత్రి 10 గంటల నుంచి వేకువజాము 4 గంటల వరకు కొండలను తవ్వి లేఅవుట్‌ల కోసం తరలిస్తున్నారు. ఈ బాగోతం అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న కొండలు తరిగిపోతుంటే వనాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి.
విధ్వంస కాండ
విధ్వంస కాండ
విధ్వంస కాండ


