ఎరువుల పంపిణీకి ప్రణాళిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియాను తగినంతగా అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. 2025–26 రబీలో అన్ని రకాల పంటలకు గాను మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ నెల 23 వరకు జిల్లావ్యాప్తంగా 11,141 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం వివిధ కేంద్రాల్లో 1,859 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. దేశీయ ఉత్పత్తితో పాటు దిగుమతులు కూ డా ఆశాజనకంగా ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రోత్సహిస్తున్న నానో యూరియా, నానో డీఏపీలను కూడా వినియోగించుకోవాలని తెలిపారు.
అధిక ధరలకు అమ్మితే చర్యలు
ఎరువుల విక్రయాల్లో డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సష్టించినా, ఇతర ప్రాంతాలకు మళ్లించినా లేదా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు.


