భక్తజన సాగరం
● ఇటు పిక్నిక్ సందర్శకులతో సాగర తీరాలు ..
● అటు భక్తులతో ఆలయాలు
● జిల్లా అంతటా సందడే సందడి
వజ్రపుకొత్తూరు రూరల్/గార/సంతబొమ్మాళి/ ఇచ్ఛాపురం రూరల్/ అరసవల్లి :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ బిజీబిజీగా గడుపుతున్నారు. సాటి మనిషితో పోటీపడే క్రమంలో ఒక్కోసారి మానసికంగా కుంగిపోతున్నారు. ఈ తరుణంలో వారానికి ఓసారి వచ్చే ఆదివారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో పిక్నిక్ పేరిట సరదాగా గడిపేందుకు సముద్ర తీరాలకు, దైవక్షేత్రాలకు తరలివెళ్తున్నారు. సహపంక్తి భోజనాలు చేసి సముద్ర తీరాలలో సరదాగా స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే వజ్రపుకొత్తూరు మండలంలో ప్రముఖ బీచ్ అక్కుపల్లి శివసాగర్ తీరానికి పర్యాటకులు ఆదివారం పోటెత్తారు. అదే బీచ్ రోడ్డులో ఉన్న నీలకంఠేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు చేరుకోవడంతో తీరం జనసంద్రంగా మారింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో పిక్నిక్ సందడి నెలకొంది. మధ్యాహ్నం తోటల్లో వనభోజనాలు చేసి, సాయంత్రం సముద్రంలో పర్యాటకులు కేరింతలు కొట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ మైరెన్ సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామం స్వర్ణాపురం బీచ్‌లో ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. స్థానికులతో పాటు ఒడిశా గ్రామాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి సరుగుడు తోటల్లో వంటా, వార్పు కార్యక్రమాలు చేసుకొని సముద్ర స్నానాలు చేశారు.
ఆదిత్యా నమోస్తుతే..
ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాస ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. అంతరాలయంలో ఆదిత్యుని దర్శనం సజావుగా సాగేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. పలువురు ప్రముఖులతో పాటు భక్తులు కూడా ఆరోగ్యం కోసం సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. కార్తీక వనభోజనాల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలయ సింహద్వారం వద్ద అరసవల్లి–గార ప్రధాన మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీకూర్మంలోనూ భక్తుల సందడి నెలకొంది.
భావనపాడు తీరంలో పర్యాటకుల సందడి
అక్కుపల్లి శివసాగర్ తీరంలో పోటెత్తిన భక్తజనం
భక్తజన సాగరం
భక్తజన సాగరం
భక్తజన సాగరం
భక్తజన సాగరం
భక్తజన సాగరం


