గుండె చెరువైంది
● చెరువులో మునిగిపోతున్న బాలుడిని రక్షించి ప్రాణాలను కోల్పోయిన యువకుడు
● కుందువానిపేట గ్రామంలో విషాద ఛాయలు
శ్రీకాకుళం రూరల్: తండ్రి లేని ఇల్లు. తల్లి కష్టం మీదే ఇన్నేళ్లూ గడిచింది. కుమారుడు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అనుకున్నట్టుగానే ఉద్యోగం లభించింది. మరో రెండు మూడు రోజుల్లో విధుల్లో చేర డానికి అంతా సిద్ధమైంది. కానీ విధి రాత మరోలా ఉంది. ఆపదలో ఉన్న బాలుడిని రక్షించబోతే అతడి ప్రాణాలు బలైపోయా యి. ఇప్పుడు ఆ ఇల్లు మళ్లీ దిక్కులేనిదిగా మారిపోయింది. కుందువానిపేట గ్రామంలో చెరువులో మునిగిపోతున్న బాలుడిని రక్షించిన చోడిపల్లి రమేష్ (23) ఆ తర్వాత ఒడ్డుకు వచ్చి ఆయాసానికి గురై ప్రాణాలు వదిలేశాడు. ఈ సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
కుందువానిపేట గ్రామానికి చెందిన సూరాడ రోహిత్ అనే బాలుడు స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి సాయంత్రం చెరువుకు వెళ్లాడు. అందరితో సరదాగా ఈత కొడుతూ ఒక్కసారిగా చెరువు మధ్యలో గల ఈశ్వరుని విగ్రహం దగ్గరకు వెళ్లిపోయాడు. అక్కడ ఊబి ఉండడంతో ముగినిపోతూ భయంతో కేకలు వేశా డు. అక్కడే ఒడ్డున ఉన్న అదే గ్రామానికి చెందిన చోడిపల్లి రమేష్ (23) ఆ బాలుడిని అతి కష్టం మీద కాపాడాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి బాలుడిని ఒడ్డుకు తీసుకువచ్చాడు. వస్తూ వస్తూనే ఆయాసం అధికం కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
రెండు మూడు రోజుల్లో సీమెన్‌గా విధుల్లోకి
పేద కుటుంబానికి చెందిన చోడిపల్లి రమే ష్‌కు తండ్రి లేడు. తల్లి లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ రమేష్‌ను చదివించారు. గ్రామంలో ఓ చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్న రమేష్‌కు ఇటీవలే మంచి కంపెనీలో సీమెన్‌గా ఉద్యోగం వచ్చింది. మరో రెండుమూడు రోజుల్లో ఆ ఉద్యోగంలోకి చేరాల్సి ఉంది. ఈ లోగా ఈ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండె చెరువైంది


