
సేన.. జగడాలేనా
జిల్లాలో సిగపట్లు పడుతున్న జనసేన నేతలు
పదవుల ఊసెత్తొద్దంటున్న అధిష్టానం
నియోజకవర్గాల్లో పట్టు కోసం కుమ్ములాటలు
మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబుల వ్యాఖ్యలపై క్యాడర్ అసంతృప్తి
అరసవల్లి:
జనసేన పార్టీలో కుమ్ములాటలు తప్పడం లే దు. పార్టీ బలపడేందుకు ఓ వైపు మంత్రి నాదెండ్ల మనోహర్, మరోవైపు ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యుడు కొణిదెల నాగబాబు వరుసగా జిల్లాలో పర్యటిస్తున్నా పార్టీ శ్రేణుల్లో మాత్రం సంతృప్తి కనిపించడం లేదు. పైగా వీరు ఉంటున్న వేదికల్లోనే వర్గ విబేధాలు, కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి మనోహర్ జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జిలను అగౌరవ పరిచారని స్థానిక కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో కూడా శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌చార్జి సర్వేశ్వరరావుకు తెలియకుండానే పాతపట్నం నేతలు అన్నీ తామై కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తుండడం వివాదాన్ని సృష్టించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావుకు వ్యతిరేకంగా పాతపట్నం నియోజకవర్గం నుంచి గేదెల చైతన్య వర్గం పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందనే వాదన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో తేటతెల్లమైంది. ఈ రెండు వర్గాలు దాదాపుగా బాహాబాహీ దిశగా తోపులాటలకు దిగారు. ఎమ్మెల్సీ నాగబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన అనే కార్యక్రమం వేదికగా వర్గాల పోరు బయటపడింది. సుడా చైర్‌పర్సన్‌గా ఉన్న జనసేన నేత కొరికాన రవికుమార్ అండదండలతోనే సొంత నియోజకవర్గానికి చెందిన పాతపట్నం నేత గేదెల చైతన్య దూసుకుపోతున్నారని స్థానికంగా చర్చనీయాంశమైంది. అలాగే మరోవైపు ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి, సీనియర్ నేత పేడాడ రామ్మోహనరావును కూడా ప్రధాన వేదికలపై పిలవకుండా ఓ వర్గం కుట్ర పన్నుతుందనే వాదనను ఆ నియోజకవర్గ క్యాడర్ తెరపైకి తెస్తోంది. ఇక జిల్లాకు జనసేన అగ్రనేతలొస్తే స్వాగతం నుంచి సాగనింపు వరకు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి విశ్వక్‌సేన్ అంతా తానై వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం అధిష్టానం దృష్టిలో ఉంది. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన రాజు ఇటీవలే కుటుంబ వ్యవహారాల్లో పోలీసు కేసుల్లో ఇరుక్కున్న సంగతి విదితమే. మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలైతే టీడీపీకి అనుబంధంగా వ్యాపారాల్లో భాగస్వామ్యులవుతూ ఉన్నారంటే ఉన్నారనేలా వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న చంద్రమోహన్ పనితీరుపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి ఉందన్న సంగతి విదితమే.
కూటమి ప్రభుత్వంలో భాగంలో ఉన్నామనే ధీమాలో జనసేన నేతలు చాలా చోట్ల నామినేటెడ్ పోస్టులకు, మరికొందరు త్వరలో జరగనున్న ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎవ్వరూ పదవులు అడగొద్దని, మనకు అంత అనుభవాలు లేవని, అర్హతలు లేవంటూ అగ్రనేతలు వ్యాఖ్యానించడం పార్టీ శ్రేణులను దిక్కుతోచని ఆలోచనలో పడేసింది. పార్టీ ఎమ్మెల్సీగా వరుసగా రెండు సార్లు జిల్లాలో పర్యటించిన నాగబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ అధినేత పవన్ కల్యాణ్ కోరిక మేరకు మరో 15 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం ఉంటుందని, మనం కూడా ఇలాగే టీడీపీకి మద్దతివ్వాలని చెప్పడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకపోగా కసుర్లు, విమర్శలు, ఆగ్రహాన్ని ప్రదర్శించడం కూడా కొందరికి మింగుడు పడలేదు. తాజాగా మంత్రి మనోహర్ కూడా జిల్లాలో కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ అదే 15 ఏళ్ల జపం చేశారు. దీంతో జనసేన శ్రేణులు ఆలోచనలో పడ్డాయి.