
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు నడుపు ప్రత్యేక బస్సులకు సంబంధించిన కరపత్రాలను శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 26వ తేదీన, అక్టోబరు 2వ తేదీన, అక్టోబరు 9వ తేదీన అక్టోబరు 16వ తేదీల్లో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పంచారామాలకు బయల్దేరుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఒక్కొక్కరికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సునకు రూ.2,400గాను, అల్ట్రా డీలక్స్ బస్సునకు రూ.2,350గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు, భక్తులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.